హీరోయిన్ అనగానే ఓ మేజికల్ ఫిజిక్ అలా కళ్లముందు కదలాడుతుంది. అయితే అన్ని సినిమాలకు ఈ సన్నజాతి నడుము సరిపోదు. అవసరమైతే కొన్ని సినిమాల కోసం లావెక్కాల్సి ఉంటుంది. అలా తమ పాత్రల కోసం లావెక్కిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. అనుష్క, కీర్తిసురేష్, కంగన లాంటి భామలకు బరువెక్కక తప్పలేదు.
బొమ్మాలి అనుష్క కాస్తా సైజ్ జీరో సినిమాతో బొద్దుగుమ్మగా మారిపోయింది. ఆ సినిమా కోసం అమాంతం లావెక్కింది అనుష్క. ఆమె హెవీ ఫిజిక్ సినిమాకు ప్లస్ అయింది కూడా. కాకపోతే ఇప్పటికీ ఆమె వెయిట్ ఇష్యూస్ తో సతమతం అవుతోంది. సైజ్ జీరో వచ్చి ఆరేళ్లు అవుతున్నప్పటికీ అనుష్క మాత్రం తన మునుపటి ఫిజిక్ కోసం కష్టపడుతూనే ఉంది.
కీర్తిసురేష్ కు మాత్రం అనుష్క లాంటి సమస్య ఎదురవ్వలేదు. మహానటి సినిమాలో సావిత్రిలా కనిపించడం కోసం కాస్త బొద్దుగా మారింది కీర్తిసురేష్. సినిమాలో ఆమె బూరెబుగ్గలు చూసి, సావిత్రి మళ్లీ పుట్టిందేమో అనుకున్నారంతా. అంతలా మహానటిని అచ్చుగుద్దినట్టు దించేసింది. అప్పటికే కాస్త బొద్దుగా ఉన్న కీర్తి, ఆ సినిమా కోసం మరో 7 కిలోలు బరువు పెరిగింది. అయితే ఇప్పుడు మాత్రం స్లిమ్ అయిపోయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ఆమధ్య ఓ సినిమా కోసం పాయల్ కూడా బరువు పెరిగింది. అనుకోని అతిథి అనే సినిమాలో పల్లెటూరి పిల్లగా కనిపించింది పాయల్. ఈ సినిమా కోసం అప్పటివరకు స్లిమ్ గా ఉన్న పాయల్.. 6 కిలోల బరువు పెరిగింది. పల్లెటూరి అమ్మాయిలు లావుగా ఉంటారనేది పాయల్ ఉద్దేశం కాదు, అప్పటికి తనకున్న సైజ్ జీరో ఫిజిక్ తో ఆ పాత్రను పోషిస్తే రక్తికట్టించలేమని భావించి, బరువు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తన పాత స్లిమ్ సైజ్ లోకి మారిపోయింది.
చీపురుపుల్లకు చీరకట్టినట్టు ఎప్పుడూ స్లిమ్ గా ఉంటుంది కంగన. అసలు తన బాడీలోనే లావెక్కే పార్ట్స్ లేవంటూ గతంలో సరదాగా వ్యాఖ్యానించింది ఈ బ్యూటీ. అలాంటి సన్నజాతి కంగనా కూడా లావెక్కింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తళైవి సినిమా కోసం కంగనా ఏకంగా 10 కిలోల బరువు పెరిగింది. సినిమాలో తన లుక్ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ధీమాగా చెబుతోంది.
రీసెంట్ గా కృతి సనన్ కూడా లావెక్కింది. మిమి అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో సరోగసీ తల్లిగా నటించింది కృతి సనన్. ఈ పాత్ర కోసం ఆమె 15 కిలోల బరువు పెరిగింది. ఈ పాత్రను ఓ ఛాలెంజింగ్ గా తీసుకున్న కృతి, చాలా తక్కువ టైమ్ లో ఇలా అమాంతం బరువు పెరిగింది. మంచి పాత్రలు దొరికితే, భవిష్యత్తులో కూడా బరువు పెరగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది ఈ బ్యూటీ.
ఈ లిస్ట్ లో విద్యాబాలన్, భూమి ఫడ్నేకర్, ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. డర్టీపిక్చర్ కోసం విద్యాబాలన్ లావెక్కితే.. తన తొలి సినిమా కోసం భూమి ఫడ్నేకర్ ఏకంగా 30 కిలోల బరువు పెరిగింది. ఇక పదేళ్ల కిందట చేసిన ఓ సినిమా కోసం ప్రియాంక చోప్రా కూడా అప్పట్లో 10 కిలోల బరువు పెరిగింది.