చేతిలో అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే… ఏం జరుగుతుందో నిలువెత్తు ఉదాహరణ అమరావతి రాజధాని. కేవలం కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలను బలిపెట్టే పునాదులపై నిర్మితమైన అమరావతి రాజధాని నిర్మాణం అర్ధంతారంగా ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి రాజధాని ప్రాంతమంతా ఒకటైతే, మిగిలిన ప్రాంతాలన్నీ మరొకటిగా భావించడం వల్లే నేడు ఈ సంక్షోభం. నేడు ఏపీకి రాజధాని ఏంటో చెప్పలేని దుస్థితికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని చెప్పక తప్పదు. చేసిందంతా చేసి, ఇప్పుడు చంద్రబాబు లబోదిబోమంటే ఎలా?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం, భారత ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో మరో నలుగురు సభ్యులతో రాజధాని నగరానికి తగిన చోటు సూచించడానికి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సంబంధిత రంగాల్లో నిష్ణాతులైన ఉన్నతాధికారులున్నారు. అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందరి ఆకాంక్షల పరిగణలోకి తీసుకుని, అందుకు అనుగుణంగా ఆగస్టు 31, 2004 వ తేదీలోపు నివేదిక సమర్పించాలని నాటి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కమిటీని కాదని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినెట్ సభ్యుడైన మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీ వేయడం వెనుక దురుద్దేశం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజధాని నగరం ఎక్కడ ఉండాలో టీడీపీ మేధావివర్గం అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకు తగ్గట్టు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వదనే భయంతోనే మంత్రి నారాయణ నేతృత్వంలోని కమిటీతో అధికారిక ఆమోదం కోసం చంద్రబాబు వ్యూహం రచించారు.
ఈ కమిటీలో టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, గల్లా జయదేవ్, అదే పార్టీకి చెందిన బీద మస్తాన్‌రావు, తమకు అనుకూలమైన పారిశ్రామికవేత్తలను వేశారు. రాజధాని ఎంపికనేది ఏమైనా వ్యాపారమా? టీడీపీ నేతలతో కమిటీ దేనికి సంకేతం? అమరావతి విధ్వంసానికి చంద్రబాబు హయాంలోనే కుట్రపూరిత ఆలోచనలే పునాదులు వేశాయని చెప్పక తప్పదు. తాను ప్రజాస్వామ్యంలో ఉన్నామనే స్పృహ చంద్రబాబుకు ఉండి ఉంటే, ఇతర ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల ఆకాంక్షలను గౌరవించే వాళ్లు. కానీ ఇక్కడ అలా జరగలేదే.
ఎంతసేపూ ప్రతిపక్ష నాయకుడు జగన్ నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఏర్పాటును ఆహ్వానించారు కదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటారు. జగన్ ఓ రాజకీయ నాయకుడు. ఆయనకు ఆ రోజుకు మద్దతు ఇవ్వాల్సిన రాజకీయ అవసరం ఉంది. ఆయన రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారు. కానీ రాజకీయాలకు అతీతంగా ప్రజల భావోద్వేగాలు, ఆలోచనలు ఉంటాయని గ్రహించడంలోనే టీడీపీ విఫలమై, నేడు రాజకీయంగా కూడా తీవ్రంగా నష్టపోయింది. మరి రాజధాని ఇచ్చారని, పట్టిసీమ నిర్మించి సాగునీళ్లు ఇచ్చారనే ప్రేమే ఉంటే కృష్ణా జిల్లాలో, రాజధాని ప్రాంతంలో తనను ఎందుకు ఓడించారో చంద్రబాబు సమాధానం చెప్పగలరా?
అమరావతి రాజధాని ఏపీ ప్రజలందరి కల కానే కాదు. ఇది కేవలం పచ్చ బ్యాచ్ మాయా ప్రపంచం. ఆ 29 గ్రామాలకు తప్ప మిగిలిన ప్రాంతాలు అసలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమే కానట్టు ఎల్లో బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరే, ఆ ప్రాంతానికి శాపమైంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాయలసీమ, ఉత్తరాంధ్రలను కూడా సమదృష్టితో చూసింది. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలుకు న్యాయరాజధాని ఇస్తూ… ఆ మేరకు చట్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉంది. మున్ముందు ఏమవుతుందో… అదే వేరే సంగతి.
జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ …అమరావతి ప్రాంతంలో భూములున్న వారు చేపట్టిన ఆందోళన నేటికి 600వ రోజుకు చేరింది. చెప్పుకోడానికి సంఖ్య చాలా పెద్దగానే కనిపిస్తున్నప్పటికీ, ఇదంతా టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ఉద్యమ క్రియేషన్ అనే విమర్శలు లేకపోలేదు. ఒకరిద్దరు ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేయగానే ఉద్యమం ఉధృతం అంటూ ఎల్లో మీడియా చేస్తున్న యాగీ అంతాఇంతా కాదు. ఈ ధోరణి అమరావతి ఆందోళనకారులకు మంచా, చెడా అనేది వారి విచక్షణకే వదిలేద్దాం.
ప్రధానంగా అమరావతి ఆందోళనకారులకు మద్దతు లభించకపోవడానికి కారణం, వారి ఈర్ష్య, అసూయలే అని చెప్పక తప్పదు. ఉదాహరణకు…ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రెండింటిని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది.
ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించింది. దీన్ని కూడా తప్పు పడుతూ… అదేదో దొంగగా ఏర్పాటు చేస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్నదంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి వైఖరి వల్ల ప్రాంతాల మధ్య వైషమ్యాలు రావా? ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఆ 29 గ్రామాలేనా? ఏపీలో రాయలసీమ భాగం కాదా? అనే ఆక్రోశం ఆ ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది.
అంతెందుకు ఆ 29 గ్రామాల్లోని కొందరి ఆందోళనకు సమీపంలోని విజయవాడ, గుంటూరు ప్రజానీకం మద్దతు కూడా లేదు. దీనికి నిలువెత్తు నిదర్శనం కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలు కావడం. ఒకవేళ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే… మూడు రాజధానులకు మద్దతు ప్రకటించినట్టే అని చంద్రబాబు హెచ్చరించి, భయపెట్టినా, అధికార పార్టీనే గెలిపించడం దేనికి సంకేతం? ఏ రకంగా చూసినా అమరావతి అనేది కేవలం కొందరి కలల సౌధం.
అందువల్లే అది కూలిపోయిందన్నది కూడా పచ్చి వాస్తవం. దీనికి టీడీపీ స్వీయ తప్పిదాలే తప్ప, మరెవరో కారణం ఎంత మాత్రం కాదు. ఈ నేపథ్యంలో ఇదే రకంగా మరో 600 రోజులు ఆందోళన పేరుతో ప్రచారం చేసుకున్నా ఒరిగేదేమీ లేదని గ్రహిస్తే మంచిది.