సినిమా పుట్టకముందున్న రంగస్థలాలు కాలక్రమంలో సన్మానాలు చేసుకోవడానికే పరిమితమయ్యాయి. దాదాపు 15-20 ఏళ్ల వరకు కొనసాగిన రంగస్థల నాటకాలు ఇప్పుడా తరం ముగిసిపోవడంతో వాటికి దాదాపు తెరపడింది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో నంది నాటకోత్సవాలు జరిగేవి. రీజనల్, జోనల్, స్టేట్ లెవెల్ పోటీలు జరిగేవి. అవి కూడా గత కొన్నేళ్లుగా జరగడంలేదు. జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నా సరిపడా నాటకపరిషత్తులు లేవు. కొన్ని పట్టణాల్లో తప్ప నగరాల్లో దాదాపు నాటకాలు కనుమరుగయ్యాయి. తెల్ల జుట్లు, బట్టతలల వయసు వాళ్లు తప్ప నవయువకుల్లో నాటకాల పట్ల మక్కువున్నవాళ్లు ఇప్పుడు లేరు. కనుక ఈ రంగం కొన ఊపిరితో మిణుకుమిణుకుమంటున్నట్టు ఉంది. కనుక రవీంద్రభారతి, త్యాగరాయ గాన సభ లాంటివి ఉంటాయి గానీ అక్కడ ప్రతి రోజూ కాసుల గలగలలు వినపడవు.
ఇదిలా ఉంటే సినిమా హాల్స్ విషయానికొద్దాం. సినిమా పుట్టినప్పటినుంచీ, అంటే దాదాపు 90 ఏళ్లుగా ఇవి ఏలుతూనే ఉన్నాయి. అయితే టూరింగ్ టాకీసులుగా ఉన్నవి అప్-గ్రేడయ్యి సింగిల్ స్క్రీన్ హాల్స్ అయ్యాయి. ఆ తర్వాత ఇంకా అభివృద్ధి చెంది మాల్స్ లో మల్టీప్లెక్స్ రూపంలోకి మారాయి. టూరింగ్ టాకీసులు కనుమరుగయ్యి సింగిల్ స్క్రీన్ హాల్స్ మిగిలినట్టు…కాలక్రమంలో సింగిల్ స్క్రీన్స్ పోయి మల్టీప్లెక్సులే మిగులుతాయి. ఈ సూచనలు ఆల్రెడీ మొదలైపోయాయి.
వారంతంలో కాలక్షేపానికి ప్రజలు కేవలం సినిమాకే వెళ్ళే రోజులు ఇప్పుడు లేవు. మాల్స్ కి వెళ్తున్నారు. అక్కడ రెస్టారెంట్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్స్, షాపింగ్ చేయడానికి రకరకాల షాప్స్..వీటన్నిటితో పాటూ సినిమా హాల్స్ ఉంటున్నాయి. అంటే థియేటర్లో సినిమాని కూడా ఒక ఐటం గా మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. దానికి కారణం ఇంట్లో టీవీ నుంచి చేతిలో మొబైల్ వరకు అన్ని వేళల, అన్ని చోట్లా కూడా సినిమాలున్నాయి ఈ రోజు.
రెండున్నర దశాబ్దాల క్రితం వరకు సెకండ్ రిలీజులుండేవి. అంటే పాత సినిమాలు కూడా సినిమా హాల్స్ లో రిలీజయ్యేవి. ఎప్పుడైతే శాటిలైట్ టీవీ రివొల్యూషన్ మొదలైందో పాత సినిమాలు టీవీలకి, వీసీపీలకే పరిమితమయ్యాయి. ఆ విధంగా థియేటర్ వ్యాపారం కేవలం కొత్త సినిమాలకే పరిమితమయ్యింది. అలా ప్రత్యామ్నాయం వచ్చినప్పుడల్లా పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెంగా వ్యాపారం చేయిదాటిపోతూ ఉంటుంది.
అదలా ఉంటే సినిమా హాల్ అనేది స్పేస్ అండ్ టైం కి లోబడి పనిచెయ్యాలి. అంటే ఆ హాల్ నడపాలంటే స్థలం కావాలి..అందులో రోజుకి నాలుగాటలకు మించి ఆడలేరు. కనుక కంటెంట్ ఫీడింగ్ కి ఒక పరిమితికి మించి చోటుండదు. అంటే ఏడాదికి 150-200 మించి సినిమాలు రిలీజు కాలేవు. వీటిమీదే అన్ని ఖర్చులకు సరిపడా డబ్బుని టికెట్స్ రూపంలో లాగాలి. సినిమా హాల్ ఖర్చులంటే మునిసిపల్ టాక్స్, కరెంట్ బిల్, స్టాఫ్ జీతాలు, ప్రోపెర్టీ టాక్స్, పబ్లిసిటీ టాక్స్, వాటర్ టాక్స్..ఇలా చాలా ఉంటాయి.
ఇక టీవీ చానల్ కి స్పేస్ తో సంబంధం లేదు కానీ టైం లిమిటేషన్ ఉంది. అంటే ఇంట్లోనే సినిమా హాలున్నట్టుంటుంది. కానీ రోజుకి 24 గంటల్లోనే ప్రసారాలు నియంత్రించుకోవాలి. అయితే టీవీ చానల్స్ ఒరిజినల్ కంటెంట్ విభాగంలో రాణించలేదు. టెలీ ఫిలింస్ అని కొత్తల్లో కొన్ని వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. కనుక సినిమా హాల్స్ లో వచ్చిన సినిమాలే టీవీ చానల్స్ లో కూడా వస్తున్నాయి. అలా శాటిలైట్ రైట్స్ రూపంలో థియేటర్ వ్యాపారం ఇంకొంత చేయిదాటిపోయింది.
ప్రస్తుతం ఓటీటీ స్పేస్ ని, టైముని రెండింటినీ అధిగమించేసింది. ఓపికున్నంత కంటెంట్ ని పెట్టుకోవచ్చు. తోచినవాడు తోచినన్త సేపు తోచిన సినిమాని చూస్తాడు. ఇక్కడ ఓటీటీ ఒరిజినల్స్ క్వాలిటీ తో మెయిన్ స్ట్రీం సినిమాకి పోటీ ఇచ్చే స్థాయిలో కొన్ని ఉంటున్నాయి. కనుక ఈ వ్యవస్థ థియేటర్ ని, టీవీ చానల్స్ ని కూడా మింగేస్తోంది. కరోనా కాలం పుణ్యమా అని లాక్డౌన్ల కారణంగా ప్రజలు ఓటీటీలకి బలవంతంగా అలవాటుపడి రుచి మరుగుతున్నారు. హాలుకెళ్లి సినిమా చూడాలంటే ఖర్చెక్కువన్న సాకుతో బద్ధకం ఫీలవుతున్నారు. అబోవ్ మిడిల్ క్లాస్ జనం ఆల్రెడీ 65/75/85 ఇంచ్ స్క్రీన్స్ ఇంట్లోనే పెట్టేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద సినిమాలు వచ్చినా పరపతి వాడి హాల్లో తొలి ఆట టికెట్ సంపాదించి హైరానా పడే కన్నా లగ్జరీగా ఇంట్లోనే కూర్చుని సొంత స్క్రీన్ లో సినిమా చూడడానికి ఉబలాటపడుతున్నారు.
సినీ సెలెబ్రిటీలు, సీ.ఎం రేంజ్ రాజకీయ నాయకులు ఈ మధ్య వరకూ కూడా నిర్మాత నుంచి క్యూబ్ కోడ్ తెప్పించుకుని తమ ఇంట్లోనే హోం స్క్రీన్ లో కొత్త సినిమాలు చూసేవారు. ఇప్పుడా లగ్జరీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ రూపంలో సామాన్యుడికి అందుబాటులోకొచ్చింది.
సల్మాన్ ఖాన్ “రాధే” భారీ బడ్జెట్ సినిమా. డైరెక్ట్ ఓటీటీ రిలీజైతే దేశంలో ఎందరో హాయిగా ఇంట్లో కూర్చుని చూసారు. ఈ సినిమా వరకు పే పర్ వ్యూవ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడంతొ సామన్యుడు కూడా సొంత మొబైల్లో పేటీయం ద్వారా టికెట్ కొనుక్కుని చూసాడు.
అమెరికాలో “సూసైడ్ స్క్వాడ్” అనే సినిమా సైమల్టేనియస్ గా థియేటర్స్ లోనూ, ఓటీటీలోనూ కూడా రిలీజయ్యింది. ఎవరికి తోచినవాళ్లు అక్కడ చూసారు.
ఇదే పద్ధతి చిరంజీవి సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా, మహేష్ సినిమా అయినా ఫాలో అవాలి. అంతే తప్ప.. “మమ్మల్ని చూడ్డానికి ప్రేక్షకులు సినిమా హాల్స్ కే రావాలి…లేకపోతే మా స్టార్డం పోతుంది..” లాంటి భ్రమల్లోంచి బయటకు రావాలి. ఏది ఏమైనా అమెరికాలో ఉన్న పద్ధతే ఇండియాకి కూడా వస్తుంది. కేవలం మ్యాటరాఫ్ టైం అంతే.
పైరసీ భయమంటారా, అది థియేటర్లోంచే ఎక్కువగా జరిగేది. ఇప్పుడు పైరసీ ఏ సిస్టం ద్వారా జరిగిందో ట్రాక్ చేసే యాంటి పైరసీ టూల్స్ కూడా అందుబాటులోకొచ్చాయి. వాటిని ఇంకొంచెం అప్-గ్రేడ్ చేసుకుని సరిగ్గా వాడుకుంటే దొంగల్ని పట్టుకోవడం తేలికవుతుంది కాబట్టి క్రమంగా పైరసీ కంట్రోల్ అవుతుంది.
ప్రస్తుతానికి కరోనా కొంత, ఆ.ప్ర ప్రభుత్వం కొంత థియేటర్స్ బిజినెస్ దెబ్బతినాడానికి కారణం అనుకుంటున్నా..అన్నీ సద్దుమణిగాక కూడా ఈ పరిస్థితుల్లో సింగిల్ సినిమా హాల్స్ మాయమవ్వడం ఖాయం. మల్టీ ప్లెక్స్లు మాత్రం ఉంటాయి. అక్కడ కూడా ఇన్నాళ్లూ జరిగినంత వ్యాపారం జరగదు. పెద్ద సినిమాల వరకు కాస్త మైలేజుంటుంది తప్ప చిన్న సినిమా అనేది ఓటీటీలో బతకాల్సిందే.
దీనివల్ల చిన్న సినిమా మరింత మెరుగ్గా బతుకుతుంది. పబ్లిసిటీ ఖర్చులు, థియేటర్ రెంట్స్, డిస్ట్రిబ్యూటర్ షేర్స్..ఇలాంటి గోలేమీ ఉండదు. పరిమిత బడ్జెట్లో తీసామా…కాస్తంత లాభానికి అమ్ముకున్నామా అంతే. ఈ లాభం-గ్యారెంటీ వాతావరణం చిన్న సినిమాకి థియేటర్ యుగంలో కష్టం.
ఒక్కోసారి తీసిన సినిమా క్వాలిటీ నచ్చక బ్రేకీవెన్ ప్రైస్ కి కూడా ఏ ఓటీటీ కొనకపోవచ్చు. అలాంటప్పుడు కొన్ని ఓటీటీలు ఫ్రీగా తీసుకుని “మినిట్స్ వాచ్డ్” బాపతులో లెక్కగట్టి ఇస్తానంటాయి. అది కూడా లాంగ్ టర్మ్ లో లాభసాటి వ్యాపారమే. అంటే సింగిల్ డీల్లో అవుతుందనుకునే బ్రేక్ ఈవెన్ ఏడాదికో రెండేళ్లకో అవ్వొచ్చు. ఆ తర్వాత వచ్చేది లాభం. ఎందుకంటే ఓటీటీలో ఎవరు ఏది ఎప్పుడు చూస్తాడో తెలియదు. కాసేపు చూసి ఆపేసినా మినిట్స్ కౌంట్ అవుతాయి. అల్రెడీ కొన్ని చిన్న సినిమాలు ఈ రకంగా ఆర్నెలల్లో బ్రేకీవెన్ అయ్యి లాభాలు కూడా ఆర్జిస్తున్నాయి. అదే కేవలం థియేటర్ మీద ఆధారపడితే లాభం మాట అటుంచి, అప్పులు తీర్చడానికి మరి కొన్ని అప్పులు చెయ్యాలి.
కనుక ఎలా చూసుకున్నా సింగిల్ స్క్రీన్స్ వయసైపోయింది. ప్రస్తుతం కొన ప్రాణంతో ఉన్నాయి. వాటి వసరం కొత్త డిజిటల్ యుగానికి లేదు. ప్రభుత్వం ఊపిరిచ్చినా, కరోనా కనికరించినా ఆయుర్దాయాన్ని వెంటిలేటర్ పెట్టి పొడిగించినట్టనుకోవాలి తప్ప మళ్లీ ప్రాణం మాత్రం పోసినట్టు కాదు.
ఉన్న సింగిల్ హాల్స్ ని మాల్స్ గా మార్చుకోగలగాలి, లేక రియల్ ఎస్టేట్ కి అమ్మేసుకోవాలి, లేదా కళ్యాణ మండపాలుగా తీర్చి దిద్దుకోవాలి. బాధే అయినా మార్పు సహజం. పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్టు…కొన్ని వ్యవస్థలు కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోక తప్పదు.
గ్రేట్ ఆంధ్ర బ్యూరో