జగన్ ఆశయం బాగుంది.. అమలు బాగుంటుందా..?

మంత్రివర్గ కూర్పు విషయంలోనే సంచలనాలకు తెరతీశారు సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం కంటే ఎక్కువ పదవులిచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఆశ్చర్యానికి గురిచేశారు, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు నామినేటెడ్…

మంత్రివర్గ కూర్పు విషయంలోనే సంచలనాలకు తెరతీశారు సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం కంటే ఎక్కువ పదవులిచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఆశ్చర్యానికి గురిచేశారు, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, కాంట్రాక్టుల విషయంలో మరీ ఉదారంగా ఉన్నారు. ఏకంగా 50శాతం బలహీన వర్గాలకు, 50శాతం మహిళలకు కేటాయిస్తూ బిల్లు పాస్ చేయించేశారు.

వాస్తవానికి మంత్రి పదవుల విషయంలో బలహీన వర్గాలకు న్యాయం చేశారు కాబట్టి, నామినేటెడ్ పోస్టులన్నీ జగన్ సామాజిక వర్గానికే దక్కుతాయని అనుకున్నారంతా, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్ట్ వర్క్ ల విషయంలోనూ వారిదే డామినేషన్ అని అంచనా వేశారు. కానీ ఇక్కడ సీన్ మరోసారి రివర్స్ అయింది. జగన్ తన సొంత సామాజిక వర్గానికి సైతం అవకాశం లేకుండా, భవిష్యత్ లో కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం లేకుండా ఏకంగా రిజర్వేషన్ ను చట్టబద్ధం చేయబోతున్నారు. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయమే.

బడుగు బలహీన వర్గాలను ఉద్ధరిస్తాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు, కానీ వాటిని ఆచరణలో పెట్టేవాళ్లు, ఇలా చట్టాలు చేసి మరీ పగడ్బందీగా అమలు చేయాలనుకునేవాళ్లు అరుదు. అలాంటి అరుదైన రకం జగన్. జగన్ ఆశయం బాగుంది, అమలు చేసే విధానమూ బాగుంది. అయితే అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేదే ప్రశ్న.

జగన్ నిర్ణయాలతో బడుగు బలహీన వర్గాలు లాభపడితే అంతా బాగుంటుంది. అయితే ఆ పేరు చెప్పుకుని మిగతా వర్గాలు లాభపడితే మాత్రం ఆయన ఆశయం నీరుగారినట్టే. వ్యవస్థలో లొసుగులు అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలు ఆటలాడితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సర్పంచ్ ల రిజర్వేషన్ల విషయంలో అందరికీ అనుభవం ఉన్న విషయాలే ఇవి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్పంచ్ లు ఉన్న గ్రామాల్లో వారంతా డమ్మీలేనని అందరికీ తెలుసు. ఎవరో ఒకరు వెనకఉండి వారిని ఆడిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కేవలం ఒకటి రెండు కుటుంబాలు బాగుపడతాయి కానీ, ఆయా వర్గాల్లో ఉన్న నిరుపేదలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోతారు. అధికారం, అవకాశం నిజంగా బలహీన వర్గాల చేతిలోకి వచ్చి, వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆయా వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు చట్టబద్ధం చేసినంత మాత్రాన అంతా అయిపోయింది అనుకోలేం. జగన్ ఆశయాలకు నిజమైన ఫలితం రావాలంటే వాటి అమలు కూడా అదేస్థాయిలో పగడ్బందీగా ఉండాలి. ఈ విషయంలో జగన్ ఓ నిఘా వ్యవస్థతో పాటు ఓ పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో.!

దేవరకొండ గురించి రష్మిక చెప్పిన ముచ్చట్లు

నటుడి కంటె నాయకుడికే ఎక్కువ కష్టం