జగన్ దారినపోయే చెత్త నెత్తిన వేసుకుంటున్నారా?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రెండునెలల ప్రాయం కూడా నిండని పసికందు! ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సరే… నెమ్మదిగా నేర్చుకుంటార్లే అని సర్దుకుపోవాల్సిన పరిస్థితి. అయితే… ఇప్పటికిప్పుడు మాత్రమే ప్రభావం చూపించగల…

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా రెండునెలల ప్రాయం కూడా నిండని పసికందు! ఒకవేళ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సరే… నెమ్మదిగా నేర్చుకుంటార్లే అని సర్దుకుపోవాల్సిన పరిస్థితి. అయితే… ఇప్పటికిప్పుడు మాత్రమే ప్రభావం చూపించగల కొన్ని తప్పుడు నిర్ణయాల విషయంలో ఇలా సర్దుకుపోవడం మంచిదే. కానీ.. భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపగల నిర్ణయాల్లో పొరబాటు జరిగితే మాత్రం.. అలర్ట్ చేయాల్సిందే.

ఇప్పుడు జగన్ ప్రభుత్వం వ్యవహారంలో అలాంటిపోకడే కనిపిస్తోంది. జగన్మోహన రెడ్డి అధికారంలోకి రాగానే.. ఇతర రాష్ట్రాల సర్వీసుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులోకి రావడానికి ముచ్చట పడుతున్నారు. కొందరు అధికారుల విషయంలో జగన్ సర్కారే ముచ్చట పడుతోంది. ఆ రకంగానే… టీటీడీకి తిరుమల జేఈవోగా ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసు నుంచి ప్రత్యేకంగా తెచ్చి నియమించుకుంది.

కొందరు సివిల్ సర్వీసెస్ అధికార్ల సమర్థత మీద రాష్ట్ర ప్రభుత్వానికి ‘ప్రత్యేకమైన’ నమ్మకం ఉండొచ్చు. అలాంటి వారిని రాష్ట్ర సర్వీసులోకి తెచ్చుకోవడంలో తప్పులేదు. ఎవరి ప్రభుత్వం ఏర్పాటు అయినా… ఇలాంటి కొన్ని నిర్ణయాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ప్రభుత్వం మారగానే.. అధికార్లే ఇతర రాష్ట్రాలనుంచి ఎగబడి ఇక్కడకు రావాలని కోరుకునే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. అలాంటి కోరికల వెనుక రకరకాల స్వార్థ ప్రయోజనాలు కూడా దాగి ఉండే అవకాశం ఉంది.

ఇప్పుడు కొందరు అధికార్లు ఏపీ సర్వీసులోకి వెళ్లడానికి ఢిల్లీ దాకా వెళ్లి పైరవీలు చేసుకుంటున్నారు. వారు జగన్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, కేసులతో ప్రమేయం ఉన్నవారు. జగన్ కు సంబంధించిన కేసులతో ముడిపెట్టకపోయినా సరే… అంతకుముంద తమ కెరీర్ రికార్డ్ లో కూడా విపరీతమైన అవినీతి అధికారులుగా ముద్రపడిన వారు. అలాంటి వారు ఇప్పుడు మళ్లీ జగన్ దళంలో చేరడానికి ప్రయత్నాల్లో ఉన్నారు.

మరోవైపు జగన్.. అవినీతి లేని పాలన అందిస్తానంటూ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారు. ఇలాంటి అధికార్లను రాష్ట్ర సర్వీసులోకి అనుమతిస్తే చాలు… అవినీతి లేని పాలన అనేది కేవలం పడికట్టు హామీ మాత్రమే అని ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

దేవరకొండ గురించి రష్మిక చెప్పిన ముచ్చట్లు

నటుడి కంటె నాయకుడికే ఎక్కువ కష్టం