కుప్పం వైసీపీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మంత్రి ఆర్కే రోజా మాటలు వింటే ఆ విషయం అర్థమవుతుంది. కుప్పంలో జగన్ సభలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ఆర్కే రోజా అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు. కుప్పంలో వాతావరణం చూస్తుంటే ఇది పులివెందులా లేక చంద్రబాబు గెలిచిన నియోజకవర్గమా? అనే అనుమానం కలుగుతోందన్నారు.
2019లో కుప్పంలో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చంద్రబాబు గెలిచారన్నారు. చిత్తూరు ఎంపీ సీటును తమ పార్టీనే గెలుచుకుందన్నారు. పార్టీలు, రాజకీయాలు చూడకుండా లబ్ధి కలిగించడం వల్లే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీనే గెలిపించారన్నారు. 2024లో కుప్పంలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కుప్పానికి నీళ్లు ఇవ్వకుండా పులివెందులకు ఇచ్చారంటే నమ్మడానికి ఎవరూ పిచ్చోళ్లు లేరన్నారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపాల్టీ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేయలేదన్నారు. కనీసం ఓటు వేయాలని కోరుతూ ఒక వీడియో కూడా విడుదల చేయలేదన్నారు.
కుప్పానికి ఏమీ చేయలేదు కాబట్టే గల్లీగల్లీలో అబ్బాకొడుకులు తిరిగి ఓట్లు అడిగినా జనం ఛీకొట్టారని రోజా విరుచుకుపడ్డారు. మాటపై నిలబడతారు కాబట్టే సీఎం జగన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ టార్గెట్ చేయాలని అనుకుంటే టీడీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను లాగేయవచ్చన్నారు. కానీ ఆ పని చేయలేదన్నారు. జగన్ జైలుకు వెళ్లడానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతితో చేరి విషాన్ని చిమ్మి, జగన్ క్యారెక్టర్‌ను దెబ్బకొట్టి, ఆయన్ను సీఎం కాకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకున్నారని, 2024లో జగనన్న వన్స్‌మోర్ అంటూ 175 నియోజక వర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. ఇది తథ్యమని రోజా ధీమా వ్యక్తం చేశారు. బాబు పాలనలో, తన హయాంలో అభివృద్ధి లెక్కల్ని తేల్చడానికే జగన్ కుప్పం వచ్చారన్నారు.