Advertisement

Advertisement


Home > Politics - National

కేసీఆర్ చేయని పని నితీష్ చేస్తున్నాడు

కేసీఆర్ చేయని పని నితీష్ చేస్తున్నాడు

జాతీయ పార్టీ పెడతా, దేశ రాజకీయాలను మార్చేస్తా, కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటూ చాలా కాలంగా ఆవేశంతో ఊగిపోతున్న కేసీఆర్ కు పోటీగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తయారైన సంగతి తెలిసిందే. కొంత కాలం కిందట బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ తాను దూరం పెట్టిన ఆర్జేడీని మళ్ళీ అక్కున చేర్చుకున్నాడు. 

అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లోకి పోవాలని, కాలం కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే ప్రధాని కావాలని కలలు కంటున్నాడు. ఎన్డీయేకు దీటుగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ ను కూడా కలుపుకుపోవాలని నితీష్ గుర్తించాడు. కానీ కేసీఆర్ కాంగ్రెస్ లేకుండా కూటమి ఏర్పాటు చేస్తానంటూ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు.

ఈయన వెళ్లి ఎవ్వరిని కలిసినా కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ సంగతి చెబుతున్నది ఎవరంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి, దాంతో విభేదించి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నాయకులే కేసీఆర్ కు ఈ మాట చెప్పారు. కానీ కేసీఆర్ వాళ్ళు చెప్పింది లెక్కలోకి తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. దీంతో ఆ నాయకులు కూడా కేసీఆర్ కూటమి ప్రతిపాదనకు పెద్దగా స్పందించడంలేదు. 

కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాయకులను కలవడమేతప్ప ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి కేసీఆర్ ను కలిసింది చాలా తక్కువ. వాళ్ళు కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి అంతగా లేనివారే. అయినప్పటికీ కేసీఆర్ తన మార్గంలోనే తాను వెళుతున్నారు.

అయితే నితీష్ కుమార్ దారి భిన్నంగా వుంది. ఆయన తన మిత్రుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 25న వారు ఢిల్లీలోని సోనియా నివాసంలో ఆమెను కలుస్తారు. నితీష్ ఇటీవలే ఢిల్లీలో పర్యటించారు. మూడు రోజులు ఢిల్లీలో గడిపిన నితీష్ అక్కడ రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, డా.రాజా, అరవింద్ కేజ్రీవాల్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి పలువురు నేతలను కలిశారు. అయితే, ఆ సమయంలో సోనియా గాంధీ ఢిల్లీలో లేరు. అందుకే తాజాగా సోనియాను కలవాలని నితీష్ నిర్ణయించుకున్నారు. అక్కడ సోనియాతో భేటీ తర్వాత నితీష్ హరియాణాలోని ఫతేహాబాద్ వెళ్తారు. అక్కడ మాజీ ఉప ప్రధాని చౌదురి దేవి లాల్ జయంతిలో పాల్గొంటారు.

అక్కడ ప్రత్యేక ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీకి ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. దేవీ లాల్ జయంతి ఉత్సవాలకు రావలసిందిగా కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. కార్యక్రమానికి రావాలంటూ శరద్ పవార్, మమతాబెనర్జీ, నితీష్ కుమార్, చంద్రబాబునాయుడు, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, తేజస్వీ యాదవ్, ప్రకాష్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ తదితరులను కూడా ఆహ్వానించారు. మరీ నేపధ్యంలో కేసీయార్ హాజరవుతారా ? కార్యక్రమాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా ? 

నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తేవాలన్న ప్రయత్నాలను ప్రస్తుతానికైతే నితీష్ కుమార్, కేసీయార్ మాత్రమే చేస్తున్నారు. మొదట్లో మమతా బెనర్జీ కూడా కాస్తహడావుడి చేసినా తర్వాత చప్పపడిపోయారు. ఇపుడు యాక్టివ్ గా ఉన్నది మాత్రం నితీష్ అండ్ కేసీయార్ మాత్రమే. ఇందులో కూడా కేసీయార్ మాత్రం నాన్ బీజేపీ పార్టీలను ఒకటిగా చేసి ఆ కూటమికి నాయకత్వం వహించాలనే ఆలోచనలో ఉన్నట్లున్నారు.  25వ తేదీ కార్యక్రమానికి కేసీఆర్ హాజరై  వీలున్నంతమంది ప్రముఖులతో భేటీ అయితే వారి నుండి వచ్చే స్పందనేమిటో తెలుసుకోవచ్చు. దాని ప్రకారం తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకునే అవకాశం కేసీయార్ కు దక్కుతుంది.

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను