నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. ఒక్కొకరు ఒక్కో రకంగా ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తే, మరికొంతమంది అన్నదానాలు చేస్తుంటారు. ప్రతి ఏటా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి.. ఆయనకు నివాళులర్పిస్తుంటారు.
ఈ ఏడాది ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లారు. యథాప్రకారం తడబడుతూనే తండ్రి గురించి మాట్లాడారు. ఆయన జాతీయ స్థాయిలో చేసిన రాజకీయాలను కొనియాడారు, కారణజన్ముడని పొగిడారు. వాస్తవానికి ఎన్టీఆర్ జయంతి రోజున.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీడియోలు వైరల్ గా మారతాయి. ఈ ఏడాది ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ లో తాతను గుర్తు చేసుకుని సరిపెట్టారు. కానీ ఈ టోటల్ ఎపిసోడ్ లో చిరంజీవి వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.
సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చిరంజీవి తన ఎమోషన్స్ అన్నింటినీ ఎలాంటి మొహమాటాలు లేకుండా బైటపెడుతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన పెట్టిన పోస్టింగ్ కూడా అదిరిపోయేలా ఉంది. “తెలుగు జాతి గౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం” అంటూ.. చిరు వేసిన ట్వీట్ నందమూరి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. వారితో కలసి నటించడం నా అదృష్టం అంటూ ఓ ఫొటోని కూడా స్వీట్ మెమొరీగా షేర్ చేశారు చిరంజీవి.
దీంతో ఈ జయంతి రోజున బాలయ్య వీడియో కంటే చిరు ట్వీట్ వైరల్ గా మారింది. బాలయ్య మాటల కంటే.. చిరు వాడిన పదాలే బాగున్నాయంటూ సోషల్ మీడియాలో కంపేరిజన్ మొదలైంది. బాలయ్య స్పీచ్ లో పస లేదని, చిరు మాటల్లో అభిమానం కొట్టొచ్చినట్టు కనపడుతోందని అంటున్నారు నెటిజన్లు. ఎన్టీఆర్ పై ట్వీట్ వేసిన చిరంజీవిని ఆకాశానికెత్తేస్తున్నారు. మెగాభిమానం అంటే అదీ అని అంటున్నారు.
ఇలా ఊహించని విధంగా చిరు-బాలయ్య మధ్య ఈరోజు పోలిక రావడం, అందులో బాలయ్య తేలిపోవడం చకచకా జరిగిపోయాయి.