చాన్నాళ్ల తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి లోకేశ్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎంతో సంతోషం ఇచ్చే పని చేశారు. 20 కిలోల బరువు తగ్గించుకుని స్లిమ్‌గా తయారు కావడమే లోకేశ్ చేసిన ఒకే ఒక్క మంచి పని. ఇంతకాలం చినబాబు తిండితీర్థాలపై ప్రత్యర్థి పార్టీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకునే వాళ్లు. ఇక మీదట వాళ్లకు ఆ పని లేకుండా లోకేశ్ చేయగలిగారు. మహానాడు సందర్భంగా బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన లోకేశ్‌ను చూసిన పార్టీ నాయకులు ఒకితం ఆశ్చర్యానందానికి లోనయ్యారు.
ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా కనిపించిన లోకేశ్….తాజాగా నాజూకుగా ప్రత్యక్షం కావడంతో కొందరు “మన లోకేశేనా” అని అనుమాన పడ్డారంటే…అతనిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పు మంచి కోసం కావడం టీడీపీ శ్రేణుల్లో ఆనందానికి ప్రధాన కారణం. లాక్‌డౌన్ వేళలో హైదరాబాద్‌లో ఇంటికే పరిమితమైన లోకేశ్…వ్యాయామం, యోగాలతో పాటు డైటింగ్ చేయడంతో అనూహ్యంగా ఆయన 20 కిలోల బరువు తగ్గారు.
అలాగే లోకేశ్ తెలుగుపై పట్టు సాధించేందుకు కసరత్తు చేసినట్టు విలేకరులతో చెప్పారు. తప్పుల్లేకుండా తెలుగు మాట్లాడ్డంపై బాగా వర్కవుట్ చేసినట్టు ఆయన తెలిపారు. లోకేశ్ బరువు తగ్గితేనే టీడీపీ శ్రేణులు ఇంత ఆనందపడి పోతున్నాయే…మరి ఆయన ఇంకో భారాన్ని తగ్గిస్తే మరెంతగా సంతోషిస్తాయో దీన్నిబట్టి అర్థమవుతోంది.
ఆ భారం ఏంటంటే…లోకేశ్ మాటల్లోనే చెప్పాలంటే తెలుగు ఉచ్ఛారణలో తప్పు లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నానంటే…తెలుగు పేరుతో నడుస్తున్న ఓ పార్టీకి కాబోయే నాయకుడి దీనస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనేక సందర్భాల్లో లోకేశ్ తెలుగు పార్టీకి తల నొప్పులు తీసుకొచ్చింది. మనసులోని భావాలను బయటికి వ్యక్తపరిచే క్రమంలో తీవ్ర తప్పిదాలు దొర్లిన సందర్భాలు అనేకం. దీంతో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి వైసీపీ లోకేశ్ భాషను తెరపైకి తెచ్చి ఆ పార్టీని ఓ ఆట ఆడుకున్నాయి. లోకేశ్ నిర్వాకంతో టీడీపీ శ్రేణులు తలలు పట్టుకున్న సందర్భాలు ఎన్నో. ఒక రకంగా పార్టీలో లోకేశ్ ఓ తెల్ల ఏనుగు లాంటివారు.
ఒక వైపు బాబు వయసు పైబడుతుండటంతో టీడీపీకి కొత్త జవసత్వాలు నింపాల్సిన అవసరం ఉంది. కానీ బాబు వారసుడిగా లోకేశ్‌లో నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదు. లోకేశ్‌ను నాయకుడిగా తీర్చిదిద్దేందుకు బాబు శత విధాలా ప్రయత్ని స్తున్నా….వృథా ప్రయాసే అవుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తులు లోకేశ్‌ను పార్టీకి భారంగా భావిస్తున్న పరిస్థితి. లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఇస్తే…భవిష్యత్‌లో ఉన్నది కాస్తా ఊడ్చుకుపోతుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో లోకేశ్‌ను తన బరువును తగ్గించుకుని అందిరికీ సంతోషాన్ని పంచినట్టే…పార్టీ భారాన్ని కూడా కాస్తా తగ్గించాల్సిన అవసరం ఉంది. తనలాగే పార్టీని కూడా నాజూకుగా తయారు చేయడం లోకేశ్ చేతుల్లోనే ఉంది. ఆ ఒక్క పని చేస్తే నాన్నతో పాటు టీడీపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన నాయకుడిగా లోకేశ్ చరిత్రకెక్కుతాడు.
-సొదుం