జూన్ ఒకటో తేదీకి అందాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనకూ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనకూ చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. రెండు నెలల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలను ఇచ్చిన అనంతరం, మూడో నెలలో అలాంటి పరిస్థితి ఉండదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. జూన్ ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలను పూర్తిగా ఇవ్వనున్నట్టుగా జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్, మే నెల మొదట్లో పడిన జీతాలు 50 శాతమే కాగా, జూన్ ఒకటిన వంద శాతం జీతమొత్తాలను ఇవ్వనున్నట్టుగా జగన్ ప్రకటించేశారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో కూడా 50 శాతం జీతాలను కట్ చేశారు. కట్ చేసిన మొత్తాలను ముందు ముందు ఎప్పుడైనా ఇస్తామని జగన్ అప్పుడే హామీ ఇచ్చారు. మూడో నెల అలాంటి ఇబ్బంది కూడా లేకుండా జీతాలన్నీ ఇవ్వడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వరసగా మూడో నెల కూడా ఉద్యోగులకు ఝలక్ ఇచ్చారు. జూన్ ఒకటిన కూడా పూర్తి జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో వేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సారి కూడా 50 శాతం కోతతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. అదేమంటే 12 వేల కోట్ల రూపాయల ఖర్చులు ఉన్నాయని, మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కేసీఆర్ అంటున్నారు. కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో కోతలు తప్పవన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రమని పలు సార్లు ప్రకటించిన కేసీఆర్ వరసగా మూడో నెల కూడా జీతాలను కోస్తుండగా, చాలా మంది మేధావులు ఏపీ ఆర్థిక వ్యవస్థ మీద జాలి ప్రకటిస్తూ ఉంటారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు మూడో నెల కోత లేకుండా పూర్తి జీతాలను ఇవ్వడానికి ముందుకు వస్తోంది. ఇలా జగన్ ముందు మరోసారి కేసీఆర్ కూడా చిన్నబోతున్నారు.