డిజిటల్ మహానాడు తొలిరోజు ప్రత్యేక ఆకర్షణ నారా లోకేషేనట. అయ్యగారు లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దాదాపు 20కేజీల బరువు తగ్గారట. పచ్చ పత్రికల రాతలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. చినబాబు బరువు తగ్గడంతో మహానాడుకి వచ్చిన వారు, కార్యక్రమాన్ని టీవీల్లో చూసినవారు ఒకటే సంబరపడ్డారట. మరికొన్ని సైట్లు మరో అడుగు ముందుకేసి.. బాడీషేమింగ్ పేరుతో చినబాబుని ప్రతిపక్షాలు ఎగతాళి చేస్తుండే సరికి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని ఆయన కష్టపడి బరువు తగ్గారట.
లోకేషేమైనా సినిమా హీరోనా బరువు తగ్గి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే వార్త వేయడానికి. పోనీ ఆయనగారేమైనా పూర్తిగా మారిపోయి కనిపించారా? ఉన్నంలో కాస్త బుగ్గలు కరిగాయంతే. అంతమాత్రానికే లోకేష్ అనుకుంటే సాధిస్తారు, పట్టుబడితే వదిలిపెట్టరు అంటూ ఆయనకి భజన చేశారు అనుయాయులు, అనుకూల మీడియా. అసలు కార్యక్రమాన్ని వదిలేసి, లోకేష్ బరువుని హైలెట్ చేసుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఇది కాదు. లోకేష్ బరువు తగ్గితే కాదు, ఆయన బుర్ర పెరిగితే వారు సంతోషించాలి. మైక్ ముందు నాలుగు మాటలు స్పష్టంగా మాట్లాడగలిగితే సంబరపడాలి. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, స్వయంగా తాను మంత్రి అయి ఉండి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని అసమర్థత తొలగిపోయినప్పుడు పండగ చేసుకోవాలి.
ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్ లో కాకుండా నేరుగా జనంలోకి వచ్చి సమాధానం చెబితే, సవాల్ విసిరితే అప్పుడు ఆనందంతో గంతులేయాలి. అంతే కాని.. చినబాబు చిక్కిపోయాడోచ్.. అంటూ లేనిపోని హంగామా చేస్తే ఉన్న పరువు కాస్తా పోతుంది. మహానాడు విలువ మంటకలిసిపోతుంది.
కొసమెరుపు ఏంటంటే.. తాను ఏ యాప్ వాడి, ఎన్ని కేజీలు బరువు తగ్గాడో, లాక్ డౌన్ కాలంలో ఏమేం తిన్నాడో అన్నీ తానే మీడియాకు వివరించారట లోకేష్. బరువు తగ్గిన లోకేష్ కి పచ్చ చొక్కాలన్నీ వదులైపోయాయట. అందుకే పాత తెల్ల చొక్కా ఒకటి వేసుకుని వచ్చారట. టీడీపీ నేతల అల్ప సంతోషం చూస్తుంటే.. వారికి లోకేష్ సరైన నాయకుడు అనిపించక మానదు.