దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి కానీ తగ్గలేదు, కనీసం స్థిరంగా కూడా లేవు. ఈ దశలో లాక్ డౌన్ నిబంధనలు ఒక్కొక్కటే సడలిపోతున్నాయి. విమానయానంతో పాటు ప్రజా రవాణా కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారు కరోనాని మోసుకొస్తున్నారని తెలిసినా ప్రభుత్వాలు ఏంచేయలేని పరిస్థితి.
అటు స్థానికంగా కూడా పక్కరాష్ట్రాల నుంచి వచ్చినవారు కరోనా వాహకులుగా ఉన్నారని అర్థమవుతున్నా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. మహా అయితే బలవంతంగా క్వారంటైన్ కి పంపిస్తున్నారు. తమ ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టినవారు మాత్రం ఎంచక్కా కుటుంబంతో కలసి తిరిగేస్తున్నారు. పోలీస్ చెక్ పోస్ట్ లు క్రమక్రమంగా ఎత్తేస్తున్నారు. జన జీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఒకరకంగా ప్రజల కదలికలను అదుపులో పెట్టడం ప్రభుత్వానికి ఇక కష్టసాధ్యమైన పనే.
లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసి, షాపులు తెరుచుకోడానికి, వ్యాపారాలు, ఉద్యోగ సంస్థలు, వైన్ షాపులకు అనుమతిచ్చింది ప్రభుత్వమే కాబట్టి.. అధికారులు చెప్పినా ఇక ప్రజలు పట్టించుకోరు. అయితే అదే సమయంలో కరోనా కేసులు పెరిగిపోవడం, కొత్త మండలాలు, గ్రామాలకు విస్తరించడం ఆందోళన కలిగించే అంశం.
ఈ దశలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటం అనివార్యం. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దు. ఒకవేళ ప్రజా రవాణా ఉపయోగించుకుంటే మాత్రం మాస్క్ ధరించడంతో పాటు, శానిటైజర్ పట్టుకుని వెళ్లడం మంచిది. వేసవిలో వాటర్ బాటిల్ ఎంత అనివార్యమో, కరోనా పోయే వరకు శానిటైజర్ క్యారీ చేయడం కూడా అంతే అవసరం. జ్వరపీడితులు, దగ్గు, జలుబు ఉన్నవారి విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా దూరంగా జరగండి.
ప్రభుత్వం అనుమతిచ్చింది కదా అని అవసరం లేకపోయినా బైటకు వెళ్తే.. రేపు కరోనా వస్తే ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది కానీ ప్రాణం తిరిగి తెస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రజలు స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు పాటించాలి. కరోనా సామాజిక వ్యాప్తి అనే దశకు చేరుకుంటున్న ఈ దశలో మునుపటి కంటే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి.
మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ భారీ ఎత్తున సడలింపులు, మినహాయింపులు ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకుమనం స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అందుకే ఈ వ్యాసం.