ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణలో భాగంగా పిటిషనర్‌ను హైకోర్టు నేరుగా ఓ ప్రశ్న అడిగింది. బాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని ప్రశ్నించింది.
అయితే గతంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచారణకు స్వీకరించిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ సమాధానంపై హైకోర్టు స్పందిస్తూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్రబాబు కేసును కూడా గురువారం విచారి స్తామని హైకోర్టు తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, విడదల రజిని, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, కిలివేటి సంజీవయ్యలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
రెండు నెలల తర్వాత సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. బాబు వస్తున్నారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా బాబుకు స్వాగతం పలకడానికి పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్దన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిం చిన విషయం తెలిసిందే.