టీడీపీ మహానాడు పెట్టుకుని కాస్తో కూస్తో మైలేజీ తెచ్చుకుంది. వైసీపీ బస్సు యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లడం మొదలుపెట్టింది. రాగా పోగా జనసేన ఇంకా ఇలాంటివేవీ మొదలుపెట్టలేదు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు.
మూడు రోజుల ఉత్తరాంధ్ర యాత్రకు బయలుదేరారు. అయితే ఈ ఉత్తర కుమార యాత్ర.. సారీ ఉత్తరాంధ్ర యాత్రలో భాగంగా ఏకంగా విమానాశ్రయంలోనే నాగబాబుకి వీర మహిళలు కర్పూరం వెలిగించి స్వాగతం పలకడం విశేషం. నాగబాబు ఎప్పుడూ విమానాలు ఎక్కలేదా, విశాఖ రాలేదా.. ఎందుకీ హారతుల ఎలివేషన్లు, ఎవర్ని మభ్యపెట్టడానికి.
వాస్తవానికి పవన్ కల్యాణ్ కి మాత్రమే విమానాశ్రయాల్లో భారీ స్వాగతాలుంటాయి. నాగబాబు వస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈసారి ఉత్తరాంధ్ర పర్యటనకు బాగా ప్రచారం కల్పించారు. మూడు రోజులపాటు మెగా బ్రదర్ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు, కలవండొహో అంటూ సంకేతాలిచ్చారు. అసలు నాగబాబు టూర్ కి అంత ప్రచారం అవసరమా అనుకునేలా అదరగొట్టారు.
విమానాశ్రయం నుంచే మొదలు..
ప్రజారాజ్యంలో నాగబాబుదే అంతా అనుకునే లోపు అక్కడ అల్లు అరవింద్ టికెట్ కౌంటర్లో వచ్చి కూర్చున్నారు. ఇక్కడ జనసేనలో అంతా నాగబాబుదే అనుకున్నా.. కౌంటర్లో నాదెండ్ల మనోహర్ తిష్టవేశారు. ఈ దశలో నాగబాబు కూడా తన హవా చాటాలనుకుంటున్నారు. అందులోనూ పార్టీ అధికారికంగా నాగబాబు టూర్ కన్ఫామ్ చేయడంతో టికెట్ కావాలనుకుంటున్న ఆశావహులంతా ఆయనను మంచి చేసుకునే పనిలో పడ్డారు.
తెల్లగడ్డంతో పెద్దరికం మీద వేసుకుని వస్తున్న ఆయనకు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికారు. 'అరే బాబూ నా చేతిలో ఏం లేదురా' అని చెప్పేలోపే జిందాబాద్ లతో ఆయన నోరు కట్టిపడేశారు. చివరకు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో ఏం తేలుస్తారో, తమ్ముడికి ఏమని సమాచారం ఇస్తారో వేచి చూడాలి.
ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఏదో ఒక కార్యక్రమంతో జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో జనసేనకు కూడా ఇది అత్యవసరం. అటు పవన్ కల్యాణ్ కి తీరికలేదు, ఇటు నాదెండ్లకు మూడ్ లేదు. అందుకే మధ్యేమార్గంగా నాగబాబుని ఉత్తరాంధ్ర నుంచి రంగంలోకి దించుతున్నారు. ఆశావహుల జాబితాలు రెడీ చేసుకుని రమ్మంటున్నారు.
ఖాళీగా ఉన్న నాగబాబు.. ఎలాగోలా జనం నోళ్లలో జనసేన అనే పేరు నానేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.