తతిమ్మా విషయాలు ఎలా ఉన్నప్పటికీ.. తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్న నాయకుల్లో చంద్రబాబునాయుడు ఒక సీనియర్ అని ఒప్పుకోవాల్సిందే. పైగా ఆయన తనకు తానుగా రాజకీయ వ్యూహ చతురుడిగా, వ్యూహ నిపుణుడిగా, చాణక్యుడిగా ఆయన తనను తాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు.
కానీ.. ఆయన వ్యూహాలు, నినాదాలు, సిద్ధాంతాలు ఎన్ని ఫలితమిచ్చాయి.. ఎన్ని బెడిసికొట్టాయి చూస్తే.. ఆయన తెలివితేటల మీద జాలి కలుగుతుంది. ఇప్పుడు కూడా ఒక కొత్త నినాదాన్ని ప్రచారంలోకి తెస్తూ ఆయన మరోసారి తప్పులో కాలేస్తున్నారని అనిపిస్తుంది.
చంద్రబాబునాయుడు తాజాగా ఏపీ ప్రజలతో కొత్త మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు వార్ వన్ సైడ్ అని చెప్పగల పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు. అంటే ఏపీలోని ప్రజలంతా ఇప్పుడు ఏకపక్షంగా తెలుగుదేశాన్నే గెలిపించాలని ఉవ్విళ్లూరుతున్నారనేది ఈ నలభయ్యేళ్ల అనుభవజ్ఞుడు చెబుతున్న మాటల సారాంశం.
ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీ అధికార పక్షాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని పదేపదే అనడం కొత్త సంగతేమీ కాదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అదే మాట అంటారు. చంద్రబాబు కూడా అదే అంటున్నారు. అయితే.. ఆయన కాస్త అతిశయం జోడించి.. ఇంత ప్రజావ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదని అంటున్నారు. ఆ మాట వింటే జాలేస్తోంది.
ఎందుకంటే.. తిరుమల కొండకు వెళుతూ అలిపిరి వద్ద బాంబు దాడికి గురై, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న చంద్రబాబు.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని అడ్డంగా క్యాష్ చేసుకోవడానికి.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయినా సరే.. ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత ఏ రేంజిలో ఉన్నదంటే.. ఆ ఎన్నికల్లో ఆయనను ప్రజలు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ ను సీఎం చేశారు. దారుణమైన ప్రజావ్యతిరేకత అంటే అదీ.. ఆ సంగతి చంద్రబాబు మరచినట్లుంది.
ఆ సంగతి పక్కన పెడితే.. ‘వార్ వన్ సైడ్’ అనేది ఆయన తాజా నినాదం, తాజా సిద్ధాంతం మరియు తాజా మైండ్ గేమ్ గా కనిపిస్తోంది. ఇప్పుడు బాబుగారివి అన్నీ.. ‘వన్ సైడ్’లే! పవన్ మీద ఆయనది వన్ సైడ్ లవ్. వైసీపీతో ఆయన సాగించబోయేది వన్ సైడ్ వార్ .. ఇలాగన్నమాట.
ఈ మాట అనేముందు చంద్రబాబు ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. విభజనకు ముందు తన అభిప్రాయం తేల్చి చెప్పకుండా.. ఆయన ‘రెండుకళ్ల సిద్ధాంతం’ పదేపదే చెప్పేవారు. ఆ సిద్ధాంతంతో ఆయన తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో సమాధి చేసేశారు. ఇప్పుడు ‘వన్ సైడ్’ అనే ఇంకో సిద్ధాంతం ఎత్తుకున్నారు. ఈ సిద్ధాంతంతో ఏపీలోకూడా ఆయన పార్టీని సమాధి చేసేయడం తథ్యం అని పలువురు పార్టీ వారే అంటున్నారు.
వార్ వన్ సైడ్ అంటూ తాము గెలిచిపోతాం అని విర్రవీగితే.. పొత్తులకు సిద్ధపడుతున్న, వన్ సైడ్ లవ్ లో ప్రేమిస్తున్న పవన్ కల్యాణ్ కూడా దూరం పోతాడేమోనని, అదే జరిగితే.. పార్టీకి చేటు తప్పదని పార్టీ వారు భయపడుతున్నారు. ఈ అతిశయం జోడించిన మాటల్ని చంద్రబాబు తగ్గించుకోవాలని అంటున్నారు.