జూలై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ నిర్ణయించారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు అధికార పార్టీ ముందుకొచ్చింది. 1949, జూలై 8న వైఎస్సార్ జన్మించారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరుతో తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారు. ఇంతింతై అన్నట్టుగా పార్టీ దినదినాభివృద్ధి సాధిస్తూ వచ్చింది. చివరికి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మరో బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీని మట్టి కరిపించింది. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికలను అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని రెండురోజుల పాటు టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించింది. మహానాడు సక్సెస్‌తో టీడీపీలో కొత్త ఊపు వచ్చింది. మహానాడుకు టీడీపీ కార్యకర్తలు కదలి రావడంతో అధినేత చంద్రబాబులో సమరోత్సాహం నెలకుంది. అందుకే ప్రతి జిల్లాలోనూ మినీమహానాడు నిర్వహించాలని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయడం ఆ పార్టీకి సవాలే. జూలై 8, 9 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ పెద్దలు నిర్ణయించారు. అయితే సమావేశాల నిర్వహణకు ఎంపిక చేసిన వేదిక సరైందేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే టీడీపీ విషయానికి వస్తే మహానాడును వ్యూహాత్మకంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించడం వెనుక పక్కా వ్యూహం కనిపించింది.
టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలకు సమీపంలో మహానాడు నిర్వహించారు. ఒంగోలుకు సమీపంలోని గంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీకి మంచి పట్టు వుంది. అమరావతి రాజధాని వివాదం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచింది. దీంతో జగన్‌ను ఎలాగైనా గద్దె దింపాలనే పట్టుదలతో బాబు సామాజిక వర్గంతో పాటు రాజధాని ప్రాంతాల్లోని ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారు. దీన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సొమ్ము చేసుకోవడంలో సక్సెస్ అయ్యిందని మహానాడు చెప్పకనే చెప్పింది.
మహానాడు సక్సెస్ వెనుక ప్రధాన కారణం వేదిక ఎంపిక కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్లీనరీని …తనను తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతంలో నిర్వహించాలని అనుకోవడంలో వ్యూహాత్మక తప్పిదం జరుగుతోందా? అనే చర్చకు తెరలేచింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి వుండొచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలను బలంగా భావించి, ఆ భ్రమల్లో ఉంటే మాత్రం వైసీపీ ఘోరంగా దెబ్బతింటుంది.
ఎన్నికలు సమీపించేకొద్ది రాజకీయ పరిస్థితుల్లో మార్పులు రావడం సహజం. ఏదో తెలియని మార్పు ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోందన్న వాస్తవాన్ని అధికార పార్టీ గుర్తించాలి. మరీ ముఖ్యంగా వైసీపీపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ విమర్శలు చేస్తున్నారనేది చేదు నిజం. అందుకే వైసీపీ ప్లీనరీ ఆ పార్టీకి సవాలే అని చెప్పడం. మహానాడును తలదన్నేలా వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాల్సి వుంటుంది.
అధికార పార్టీ కావడంతో సభను విజయవంతం చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే అధికారం వచ్చిన తర్వాత తమకేమీ జరగలేదనే తీవ్ర నిరాశనిస్పృహల్లో పార్టీ శ్రేణులు, నాయకులు ఉన్న నేపథ్యంలో… స్వచ్ఛందంగా ఎంత మేరకు వస్తారనేదే ప్రధాన ప్రశ్న. గతంలో మాదిరిగా వైసీపీ సమావేశాలకు జనం వెల్లువెత్తే పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. ఎందుకంటే పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కసి గతంలో మాదిరిగా ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో లేదు. అధికారంలోకి వచ్చినా, తమకేంటి? అనే ప్రశ్న ఎవరిని కదిలించినా వినిపిస్తోంది.
మహానాడుకు టీడీపీ కార్యకర్తలు భారీగా వెళ్లడం వెనుక పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదల కనిపించింది. జగన్ ప్రభుత్వ వేధింపుల నుంచి బయటపడాలన్న తపన కనిపించింది. అధికార పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఫైర్ కనిపించింది. ఇలాంటివి వైసీపీ శ్రేణుల్లో కనిపించే అవకాశమే లేదు. ఇవన్నీ 2019కి ముందున్నాయి. ఆ ఫైర్ వైసీపీని అధికారం వరకూ నడిపించింది.
పల్లకీలు మోసిన వారికి ఒరిగిందేమిటో అందరికీ తెలుసు. తలకు మించిన హామీలిచ్చి, వాటిని అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. దీంతో ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలు, నాయకులకు చేసే పరిస్థితి లేదు. గుంపులో గోవిందా అని తమను జమ కడుతున్నప్పుడు తామెందుకు పార్టీ జెండా మోయాలని సగటు పార్టీ కార్యకర్త, నాయకుడు ప్రశ్నిస్తే….వైసీపీ నుంచి సమాధానం కొరవడుతోంది.
పార్టీపై తీవ్రమైన అసంతృప్తి, నిరాశనిస్పృహల మధ్య వైసీపీ ప్లీనరీ అధికార పార్టీకి సవాల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదనుకుంటా.
సొదుం రమణ