పొత్తులపై మోడీతో పవన్ భేటీకి ముహూర్తం అదేనా?

ఏపీలో ఆల్రెడీ ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే. పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్టుగానే తమ తమ మాటలను సంధిస్తున్నాయి. జగన్ వ్యతిరేక ఓటు చీలదు అని ఎవరికి వారు అనేస్తున్నారు గానీ.. ఇంకా ఏ…

ఏపీలో ఆల్రెడీ ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టే. పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్టుగానే తమ తమ మాటలను సంధిస్తున్నాయి. జగన్ వ్యతిరేక ఓటు చీలదు అని ఎవరికి వారు అనేస్తున్నారు గానీ.. ఇంకా ఏ పార్టీల మధ్య పొత్తు ఏర్పడలేదు. 

జనసేన తెలుగుదేశం ఆల్రెడీ ఒకరి భజన ఒకరు చేసుకుంటున్నారు. అయితే… బిజెపి కొన్ని ఓట్లను కూడా చీల్చకుండా వారిని కూడా చంద్రబాబు భజన కూటమిలోకి చేర్చాలనేదే పవన్ కల్యాణ్ లక్ష్యం. అయితే ఆ సంగతిని ప్రధాని మోడీ ద్వారా తప్ప మరో రకంగా తేల్చడం కుదరదు. అయితే… పవన్ కల్యాణ్ మోడీని ఎఫ్పుడు కలుస్తారు… పొత్తుల సంగతి ఎఫ్పుడు తేలుస్తారు? అనేది చర్చనీయాంశం.

ఢిల్లీలో ఉండగా మోడీతో గానీ, అమిత్ షాతో గానీ అపాయింట్మెంట్ ఇప్పించుకోవడం ఒక పట్టాన సాధ్యమయ్యే పని కాదు. వారు పిలిచిన తర్వాత అక్కడకు వెళ్లినా కలిసి కూర్చోడానికి రోజులు పడుతుంది. అయితే పొత్తుల సంగతి త్వరగా తేల్చేయాలని, తమ పార్టీకి చంద్రబాబు ఏయే సీట్లు ఇస్తారో ముందే తేల్చుకుంటే.. ఇప్పటినుంచి ఆయా నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టి సత్ఫలితాలు సాధించవచ్చని ఆయన కోరిక. 

నిజానికి అందులో తప్పేం లేదు. కానీ.. మోడీని కూడా పొత్తులకు ఒప్పించాలనుకోవడమే తగాదా. అయితే ఇప్పట్లో పవన్ ఢిల్లీలో మోడీ అపాయింట్మెంట్ దొరకబుచ్చుకోవడం అంత వీజీయేం కాదు.

అయితే.. జులై 2, 3 తేదీల్లో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాదులోనే బస చేయనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయనతో పాటు అమిత్ షా తదితర ప్రముఖులు కూడా హైదరాబాదులోనే ఉంటారు. మోడీ బస రాజ్ భవన్ లోనే కాబట్టి ఆ రెండు రోజుల్లో ఓ అయిదు నిమిషాలు అపాయింట్మెంట్ పెద్ద కష్టమేమీ కాదు అనేది పవన్ ఆలోచన. 

మోదీని కలిసి ఏపీ రాజకీయాలపై కీలకనిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉంది. మోడీతో కుదరకపోతే కనీసం ఆ రెండు రోజులూ ఇక్కడే ఉండే అమిత్ షాను కలిసి అయినా.. పొత్తుల సంగతి చర్చించాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. రెండు రోజులు ఇక్కడే ఉండే సమయంలోనూ వారిని కలవడం కుదరకపోతే.. ఇక బీజేపీ మీద ఆశ వదులుకుని, తనంతట తాను చంద్రబాబుతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 

ఇప్పుడే పొత్తులు, సీట్లు అధికారిక ప్రకటన చేయకపోయినా.. తమకు ఇవ్వగల సీట్లు ఏమిటో ఒక నిర్ణయానికి వస్తే.. ఆయా నియోజకవర్గాల్లో తాము పార్టీని బలోపేతం చేయడానికి దృష్టిపెట్టవచ్చునని జనసేన వ్యూహం.