ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ప్రతీ మొండితనానికి బదులు కూడా ఉంటుంది. ఒక్కోసారి ఒక రూట్లో సెట్ అవని సమస్యలకు వేరే రూట్లో జవాబు ఉంటుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది. ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సొంత పార్టీ వారు బాగానే తలూపుతున్నారు.
ఇక విపక్షాలతో పనేంటి అని వారు దూకుడుగా ముందుకు పోతున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఉంది. ఏపీలో అధికార వైసీపీ, వామపక్షాలు, టీడీపీ మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
దాంతో వాళ్ళంతా విపక్షం కాబట్టి అలాగే మాట్లాడుతారు అన్నట్లుగా బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరి అదే ఏపీ బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే ఒప్పుకోమంటూ మొండికేస్తే. అంతే కాదు వారు తమ పదవులకు రాజీనామా చేస్తే సీన్ ఎలా ఉంటుంది.
ఇదే ఇపుడు ఉద్యమకారుల నుంచి వస్తున్న సూచన. టీడీపీ మాత్రం సూటిగా బీజేపీని ఇలా అడగడం మానేసి వైసీపీని రాజీనామా చేయమంటోంది. కానీ వారూ వీరూ ఎందుకు మోడీ పార్టీ వారే మాకొద్దీ ప్రైవేటీకరణం అంటూ హస్తిన నేతల మీద యుద్ధం ప్రకటిస్తే ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది అంటున్నారు.
విశాఖకే చెందిన బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఉన్నారు. అయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే కధ వేరుగా ఉంటుందని కూడా సూచిస్తున్నారు. అంతే కాదు, ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు, టీడీపీ నుంచి జంప్ చేసిన మరో ముగ్గురు రాజ్య సభ బీజేపీ ఎంపీలు కూడా పదవులు వద్దు అంటే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా వస్తోంది.
బీజేపీ ఏం చేస్తుందో తరువాత కానీ వీరు రాజీనామాలు చేస్తారా అన్నదే ప్రశ్నట. ఇదిలా ఉంటే రాజీనామాల దాకా ఎందుకు కనీసం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు అయినా తెలియచేయలేకపోతున్నారే అన్నదే కార్మికుల ఆవేదన.