విశాఖలో ఉన్నతాధికారులు తరచూ దాడులకు గురి అవుతున్నారు. అది కూడా తమ కింద అధికారుల నుంచే కావడం విశేషం. ఇక్కడ తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే ఉన్నతాధికారుల నుంచి ఇబ్బంది ఉంటే ప్రొసీజర్స్ ప్రకారం పై స్థాయిలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సర్వ సాధారణ విధానం.
కానీ ఏకంగా తామే చట్టాన్ని చేతిలో తీసుకుని తమ పై అధికారుల మీద దాడులకు పాల్పడడం మాత్రం కలకలం సృష్టిస్తోంది. తాజాగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ మీద అదే శాఖలో సహాయ కమిషనర్ గా పని చేస్తున్న శాంతి అనే మహిళా అధికారిణి ఇసుక ఆయన మీద పోసి సంచలనం రేకెత్తించారు.
పుష్పవర్ధన్ చాంబర్ లోకి నేరుగా దూసుకువచ్చిన శాంతి ఆయనతో గొడవపడుతూనే చేతిలో తెచ్చిన ఇసుకను ముఖంపైన పోసి హడలెత్తించారు. దీని మీద ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మహిళను అన్నది చూడకుండా తన మీద పుష్పవర్ధన్ కక్షసాధిస్తున్నారు అని శాంతి చెబుతూంటే ఆమె తనను చంపాలనే దాడి చేశారని పుష్పవర్ధన్ అంటున్నారు.
ఈ ఇద్దరు గత కొన్నాళ్ళుగా గొడవలు పడుతున్న దేవదాయ శాఖలో పై స్థాయి అధికారులు ఉదాశీనంగా ఉండడం వల్లనే ఇలా శాంతి డైరెక్ట్ అటాక్ కి దిగిపోయింది అన్న మాట కూడా ఉంది.
మరో వైపు ఇదే విశాఖ జిల్లాలో మైనింగ్ విభాగంలోని ఉన్నత అధికారి ప్రతాపరెడ్డి మీద ఆయన దిగువ అధికారి ఏకంగా టీ పోసి అవమానించారు. ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆ దిగువ అధికారిని సస్పెండ్ చేసి మైనింగ్ శాఖ దర్యాప్తు జరుపుతోంది.
ఈ రెండు ఘటనలూ విశాఖలో ఈమధ్యనే జరగడంతో అసలు విశాఖ జిల్లాలో అధికారులకు ఏమైంది అన్న చర్చ అయితే వస్తోంది. మరెంతమంది వీటిని స్పూర్తిగా తీసుకుంటారో. లేక ప్రభుత్వమే చొరవ చూపిస్తూ ఇలాంటివి జరగకుండా చక్కదిద్దుతుందో లేదో చూడాలి మరి.