తమ కూతురిని చంపి ఇంట్లోనే సమాధి చేశారని కలత చెందిన ఓ కుటుంబం …ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంది. తల్లీకూతురిని హతమార్చారు. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని డి.నేలటూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.
2019లో డి.నేలటూరులో వరకట్న వేధింపుల్లో భాగంగా షరీష్మా అత్తింటి వారి చేతిలో హత్యకు గురైంది. కోడలి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన అత్త అంజనమ్మ, ఆమె కూతురు లక్ష్మిదేవి నిందితులు. హత్య చేయడంతో పాటు అత్తింట్లోనే పరీష్మాను సమాధి చేయడాన్ని పరీష్మా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు.
కోడలి హత్య కేసులో అంజనమ్మ, లక్ష్మిదేవి జైలుకు వెళ్లారు. అనంతరం ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. సొంతూరు వెళితే ప్రాణాపాయం పొంచి ఉందనే భయంతో బ్రహ్మంగారిమఠంలో తలదాచుకుంటున్నారు. హత్యకు సంబంధించి గ్రామంలో ఈ రోజు పంచాయితీ పెట్టారు. దీని కోసమని తల్లీకూతురు డి.నేలటూరు వెళ్లారు.
ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భావించి నరికి చంపారు. సంఘటన స్థలానికి మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్ వెళ్లి విచారించారు. పాత కక్షలే కారణమని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తల్లీకూతుళ్ల హత్య కడప జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది.