ఎక్కడ విన్నా, ఏ ఛానెల్ లో చూసినా, ఏ సోషల్ మీడియా హ్యాండిల్ ని తిరగేసినా మారుమోగుతున్న పేరు పీ వీ సింధు. టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి బ్రాంజ్ మెడల్ సంపాదించడమే కాదు.. అంతకు ముందు రియో ఒలింపిక్స్ లో పతాకం సాధించిన తొలి మహిళా అథ్లెట్ మన తెలుగు తేజం కావడం నిజంగా మనకు గర్వకారణం.
దేశ ప్రథమ పౌరుడి నుంచి సాధారణ పౌరుడి వరకు సింధు పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. సింధు పోరాట పటిమ, కృషి , పట్టుదల, పతకం తెచ్చి తీరాలన్న సంకల్పం, ఆమె వెనుక నిలిచి ఆశీర్వదించి పంపించిన ఆసేతుహిమాచలం ఒక బలం అయితే.. సింధుని తీర్చిదిద్దడంలో వెన్నుదన్నుగా నిలిచిన “గోపీచంద్ నిమ్మగడ్డ అకాడెమి” ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
అకాడెమి స్థాపించాలన్న గోపీచంద్ ఆలోచనని పూర్తి స్థాయిలో సాకారం చేసిన శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ సహాయ సహకారాల్ని తెలుగు జాతి ఎన్నటికీ మరిచిపోదు. నిజానికి కృతజ్ఞతలతో ఉంటుంది. ఎక్కడైనా ప్రతిభ ఒక్కటీ సరిపోదు. దాన్ని ప్రదర్శించడానికి అవసరమైన వేదికలు మాత్రమే చాలవు. ఈ రెండిటికీ మధ్య సమన్వయం చేసేలా శిక్షణకు సరైన గురువు కావాలి. వీరిద్దరికీ అప్ డేటెడ్, స్టేట్ అఫ్ ది ఆర్ట్ శిక్షణ సంస్థ తప్పనిసరి.
హైదరాబాద్ లో ప్రముఖ అథ్లెట్, కోచ్ శ్రీ పుల్లెల గోపీచంద్ ఆలోచనకు శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ అందించిన సాయం గోపీచంద్ కలని నిజం చేయడమే కాదు.. ఎందరో అథ్లెట్ లను తయారు చేస్తోంది. మరెందరినో దేశం గర్వించేలా తయారు చేస్తోంది. ఫలితంగా నేడు అంతర్జాతీయ స్థాయిలో పీవీ సింధు నిరూపిస్తే, మరెందరో క్రీడాకారులు, క్రీడాకారిణులు వివిధస్థాయుల్లో కూడా జెండా ఎగరేస్తున్నారు.
సింధు పతకం ఒకరోజులో సాధ్యమైన విషయం కాదు. ఒకరోజులో సాధించదగ్గ విజయం కాదు. ఈ పతకం వెనుక సింధు ప్రతిభని సానపెట్టడంలో, ఆమె ఆతని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో, ప్రపంచ స్థాయి ఆటగాళ్లను దీటుగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడంలో ” గోపీచంద్ నిమ్మగడ్డ అకాడెమి” పాత్ర ఎంతో వుంది.
రియో ఒలింపిక్స్ లో పోటీని ఎదుర్కొనే సమయంలో సింధుకి గోపీచందే కోచ్ గా ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ లో సింధు పతకం సాధించిన తరవాత గురువుగా గోపీచంద్ తనని అభినందించిన విషయం కూడా సింధు మీడియాకు చెప్పింది.
పాతికేళ్ళ భవిష్యత్తుని ఈ రోజే వూహించగలిగినవాడే అసలైన దార్శనికుదు. రేపటి సవాళ్ళను అవసరాలను ఎదుర్కొనేలా నేడే ఒక పథకాన్ని అలోచించి ఆచరణలో పెట్టగలిగే వాడే నిజమైన మార్గదర్శకుడు. టెలివిజన్ , ఫార్మాస్యూటికల్ వంటి ఎన్నో రంగాల్లో తమదైన తిరుగులేనీ విజయాల ముద్ర వేసిన శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ ఆనాటి ఆలోచన ఇస్తున్న ఫలితాలు వారికే కాదు… మన రాష్ట్రానికే కాదు.. దేశానికే పేరు తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు మన తెలుగు ప్రతిభ గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందంటే.. దానికి ప్రధాన కారణం ఏనాడో శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ ఆలోచనల పునాది. ఇక్కడి నుంచి మరింత మంది సింధులు వస్తారని, రావాలని తెలుగు జాతి కోరుకుంటోంది.