చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు లోకేశ్‌లపై విమర్శలు చేయడంలో రోజా ముందుంటారు.
తాజాగా తన జిల్లాకే చెందిన అమరరాజా పరిశ్రమపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె వారికి సవాల్ విసరడం సంచలనం సృష్టిస్తోంది.
చిత్తూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలతో పాటు అమరరాజా యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రోజా ఏమన్నారో ఆమె మాటల్లోనే తెలుసకుందాం.
“అమరరాజా కంపెనీపై కక్ష కట్టి తరిమేస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నేతల్ని సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. అమరరాజా కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య రాజకీయం ఏమైనా ఉందా? ఇక్కడుండేది రాజకీయ సమస్య కాదు. కాలుష్య సమస్య. అమరరాజాది తప్పని పొల్యూషన్ బోర్డే కాకుండా సాక్ష్యాత్తు హైకోర్టే చెప్పింది. ఇదే చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ సమస్య ఉత్పన్నమైనప్పుడు ….ప్రభుత్వాలు పరిశ్రమలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఎల్జీ పాలిమర్స్ లాంటి పరిశ్రమలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే …అలాంటి పరిశ్రమలను ప్రజల మధ్య ఎందుకు ఉంచారని చంద్రబాబు నాడు ప్రశ్నించారు. ఈ రోజు రెడ్ కేటగిరీలో తీవ్రంగా కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలపై రైడ్ చేస్తే… ఎందుకింత యాగీ చేస్తున్నారు. అమరరాజా కంపెనీ ఒక్కటే కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 54 రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలకు క్లోజర్ నోటీసులను పొల్యూషన్ బోర్డు ఇచ్చింది.
నేను ఒక్కటే అడుగుతున్నా…చంద్రబాబునాయుడిని, పచ్చ బ్యాచ్‌ని. తెలుగుదేశం నేతలు ప్రతిదానికి నిజనిర్ధారణ కమిటీ అంటారు కదా? అమరరాజా కంపెనీ పొల్యూషన్ నిగ్గు తేల్చేందుకు అన్ని పార్టీలతో కలిసి నిజనిర్ధారణ కమిటీ వేయించాలి. ఆ ప్యాక్టరీకి తీసుకెళ్లాలి. అక్కడ పరిశ్రమ వల్ల కాలుష్యం లేదని నిరూపించాలని నా సవాల్.
ఇప్పటికైనా అమరరాజా యాజమాన్యం బయటికొచ్చి తాము తప్పు చేయలేదని , కాలుష్యం లేదని, కార్మికుల శరీరాల్లో లెడ్ లేదని చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాలేవీ చెప్పరు. ఎందుకంటే చేస్తున్నది తప్పు కాబట్టి. కానీ టీడీపీ నేతలు మాత్రం గగ్గోలు పెడతారు” అని రోజా తనదైన స్టైల్‌లో నిప్పులు చెరిగారు. సరైన సమయంలో రోజు అదిరిపోయే సవాల్ విసిరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.