చంద్రబాబు నాయుడు హయాంలో.. భారతీయ జనతా పార్టీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, భారతీయ జనతా పార్టీ నేతలు టీటీడీ సభ్యులుగా ఉండగా… టీటీడీ నిరార్ధక ఆస్తుల అమ్మకం గురించి నిర్ణయాలు జరిగాయి. అవే ఉత్తర్వుల ప్రకారం ముందుకు వెళ్లబోతే ప్రస్తుత టీటీడీ బోర్డును, ప్రభుత్వాన్ని కలిసి విమర్శిస్తున్నారు! ఈ విషయంలో కమలం పార్టీ వాళ్లు తెగ ఊగిపోతున్నారు. నిన్నలా మొన్నటి నుంచి కాషాయ కండువాలు వేసుకున్న వాళ్లు చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు సుమా!
తీరా తాము అధికారం పంచుకున్న ప్రభుత్వంలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా బయటపడినా, వీళ్లు తమకేం తెలియనట్టుగా కలరింగ్ ఇస్తున్నారు. వీళ్లు తీరుతో జరగాల్సిన డ్యామేజీ జరుగుతూనే ఉంది. ఆ సంగతలా ఉంచితే.. ఈ విషయంలో పక్క రాష్ట్రాలకు చెందిన వీర హిందుత్వవాదులు కూడా రెచ్చిపోతున్నారు. కర్ణాటకకు చెందిన తేజశ్వీ సూర్య అనే ఒక ఎంపీ వీర హిందుత్వవాద డైలాగులతో రెచ్చిపోతుంటాడు లే.
ఆ మహాశయుడు టీటీడీ విషయంలో పోరాడేయాలని పవన్ కల్యాణ్ కు, బీజేపీకి ట్విటర్లో సూచించేశారు. వెనుకాముందు వాకబు చేసుకోకుండా మాట్లాడటమే బీజేపీ మార్కు హిందుత్వవాదం అయిపోయి చాలా కాలం అయ్యింది ఇలాంటి వారికి ఆ పార్టీ ఎంపీనే అయిన సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి గట్టిగానే గడ్డి పెట్టారు. టీటీడీ వ్యవహారంలో బీజేపీ డొల్ల పాత్ర ఇప్పటికే బయటపడిపోయింది. ఆ విషయాన్నీ స్వామి ప్రస్తావించారు.
ఇక ఉత్తారాఖండ్ లో బీజేపీ చేస్తున్నదేమిటి? అంటూ స్వామి ప్రశ్నించారు. ఛార్ దామ్స్ తో సహా 53 దేవాలయాలన్నింటి మీద ఉత్తరాఖండ్ లోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేస్తోందని, అన్ని ట్రస్టులకూ తననే చైర్మన్ ప్రకటించుకుంటూ ఉత్తరాఖండ్ లోని బీజేపీ సీఎం చట్టం చేసేసుకున్నాడని.. ఈ విషయంలో బీజేపీ ఏం చెబుతుంది? అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.
ఈ విషయంలో వీర హిందుత్వవాది తేజశ్వి సూర్యనూ, కాషాయ ఇమేజ్ కోసం తెగ తాపత్రయపడుతున్న పవన్ కల్యాణ్ ను కూడా ఆయన ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. మరి వీరు సమాధానాలు ఇస్తారా? లేక వీరి తరఫున వీర హిందుత్వ వాదులు కన్నా లక్ష్మినారాయణ, సుజనా చౌదరి, భానుప్రకాష్ రెడ్డిలు సమాధానం ఇస్తారా?