డానాకు మనసు స్థిమితంగా లేదు. తప్పు చేసి తప్పించుకోవడం నా వల్ల కాదు, పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒప్పేసుకుంటాను అంది తండ్రితో. బ్రాడీ నేనూ వస్తాను పద అన్నాడు. ఆ సంభాషణ వినేసిన వర్జిల్ డేవిడ్‌కు చెప్పడం, అతను క్యారీని వెళ్లి ఎలాగైనా ఆపమని చెప్పడం జరిగాయి. పోలీసు స్టేషన్ దగ్గర క్యారీ కనబడి బ్రాడీని పక్కకు తీసుకెళ్లి ”నువ్వు వెళ్లి రిపోర్టు చేస్తే వాల్డెన్కు, నీకూ చెడుతుంది. అప్పుడు నజీర్ నిన్ను పట్టించుకోవడం మానేస్తాడు. నజీర్‌ను పట్టుకోవడానికి నువ్వు ఉపయోగపడవని తెలిసిన మరుక్షణం సిఐఏకు, నీకు కుదిరిన ఒప్పందం లేనట్లే. నీ వీడియో బయటపెట్టేసి చేతులు దులుపుకుంటాం.” అంది.
గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్రాడీ వెనక్కి మళ్లవలసి వచ్చింది. తర్వాత మళ్లీ వద్దాంలే అన్నాడు కూతురితో. పూర్వాపరాలు తెలియని డానాకు విపరీతంగా కోపం వచ్చింది. రాజకీయాల్లో పైకి రావడానికై తండ్రి ధర్మవిరుద్ధంగా నడుస్తున్నాడని, తన ప్రియురాలు క్యారీ చెప్పినట్లు ఆడుతన్నాడని కోపంతో తండ్రి కారెక్కకుండా కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది.
అక్కణ్నుంచి మైక్ యింటికి వెళ్లి ఇక్కడ వుండవచ్చా అంది. తప్పకుండా అన్నాడతను. కాస్సేపు ఏడ్చి, అక్కడే నిద్రపోయింది. బ్రాడీ యింటికి ఒంటరిగా తిరిగి రావడం చూసి జెసికా నిలదీసింది. ఈ పరిస్థితుల్లో రిపోర్టు యివ్వడం మంచిది కాదనుకున్నాను, డానాకు ఆ సంగతి చెపితే కోపగించుకుని ఎటో వెళ్లిపోయింది అన్నాడు బ్రాడీ. నీకు రాజకీయాలు ఎక్కువయ్యాయా అని జెసికా బ్రాడీ మీద అరిచి, మైక్ యింటికి వెళ్లి చూద్దామని బయలుదేరింది.
బ్రాడీ హతాశుడై, చేష్టలుడిగి యింట్లో నేలమీద చతికిలపడి కూర్చున్నాడు. నిజానికి అతను ఇంకో అరగంటలో రోయాతో కలవాల్సి వుంది. కానీ డబుల్ ఏజంటుగా ఉండడం, మధ్యలో యింటి సమస్యలు ఎదుర్కోవడం అతని వలన కావటం లేదు. డానా మైక్ యింటికి వెళ్లిన విషయం సిఐఏ టీము ద్వారా తెలుసుకున్న క్యారీ ఆ విషయం చెపుదామని, దానితో బాటు రోయా మీటింగు గురించి గుర్తు చేద్దామని బ్రాడీకి ఫోన్ చేసింది.
అతను తీయకపోవడంతో స్వయంగా అతని యింటికి వెళ్లింది. అతని పరిస్థితి చూసి జాలి పడింది. ఇది నాకు అలవికాని పని అంటున్న బ్రాడీకి ధైర్యం చెప్పి రోయాతో సమావేశానికి బయలుదేర తీసింది. ఈ లోగా జెసికా మైక్ యింటికి చేరి అడిగితే డానా నిద్రపోతోందని అతను చెప్పాడు. అప్పుడు యాక్సిడెంటు గురించి చెప్పి, డానాకు విశ్రాంతి అవసరమనీ, పడుక్కోనీయమని చెప్పి వెనక్కి మరలింది.
బ్రాడీని చూసి రోయా “ఏమిటిలా వున్నావు?” అంది. ”అమెరికాపై దాడిలో పాలుపంచు కుంటున్నానన్న ఆలోచన నన్ను కుదురుగా వుండనీయటం లేదు. ఇక నా వల్ల కాదు. నన్ను వదిలేయ్. ” అంటూ బ్రాడీ ఆమెను విదిలించుకుని కారెక్కి వెళ్లిపోసాగాడు. అతని తరహా చూసి రోయా ఎంత కంగారు పడిందో, అతన్ని వెనక్కాల వ్యాన్‌లో వెంటాడుతున్న క్యారీ కూడా అంతే కంగారుపడింది. వ్యాన్‌లో తనతో పాటు వున్న వర్జిల్తో బ్రాడీ మాటలు వింటున్న పరికరాలు ఆఫ్ చేసేయ్ అని చెప్పి, తన ఫోన్ కూడా ఆఫ్ చేసేసి, వ్యాన్ దిగి బ్రాడీ కారును అడ్డగించి, లోపల ఎక్కేసింది.
బ్రాడీ చికాగ్గా ఉన్నాడు. నా దారిన నన్ను పోనీయ్ అన్నాడు. నీ శేషజీవితం జైల్లో గడపకుండా చూద్దామనే నా తాపత్రయం అంది క్యారీ. ‘నువ్వు ఎక్కడికి వెళదామనుకుంటే అక్కడికి వెళ్లు, సిఐఏ నిన్ను వెంటాడకుండా ఏర్పాట్లు చేశాను. నా మాటలూ వాళ్లు వినలేరు’ అంది. క్యారీ దుందుడుకుతనం వలన తనూ, బ్రాడీ యిద్దరూ తమ పర్యవేక్షణ నుంచి తప్పిపోయినందుకు డేవిడ్‌కు కోపం వచ్చింది. బ్రాడీని మళ్లీ మన మార్గంలోకి తేవడానికే క్యారీ అలా చేసిందేమో అని సాల్ నచ్చచెప్పబోయాడు. డేవిడ్ వినిపించుకోలేదు. క్యారీ ఎక్కడకు పోయిందో వెతికి పట్టుకోమని అందరికీ ఆదేశాలిచ్చాడు.
క్యారీ, బ్రాడీ కలిసి ఒక మోటల్‌కు వెళ్లారు. ఏకాంతంగా కూర్చున్నపుడు సిఐఏతో సహకరించడమే మంచిదని ఆమె అతనికి నచ్చచెప్పింది. ‘ఇప్పటికే నజీర్ నన్ను నమ్మడం మానేసి వుంటాడు. ఇక మీకేమీ సాయపడలేను.’ అన్నాడు బ్రాడీ నిస్పృహతో. ‘నువ్వు గతంలో ఏం చేశావన్నది ముఖ్యం కాదు, నజీర్ చేయబోయే దాడి గురించి సమాచారం యివ్వగలిగితే మాకు చాలు’ అంది క్యారీ. అతను క్రమేపీ తన గ్రిప్ లోకి వచ్చాడన్న నమ్మకం చిక్కాక తన సెల్‌ఫోన్ ఆన్ చేసి ఆఫీసువాళ్లు తన మాటలు వినే అవకాశం కల్పించింది. దాంతో ఆఫీసులో మానిటార్ చేస్తున్న పీటర్, సాల్లకు వాళ్లిద్దరి సంభాషణ వినబడసాగింది. అతనికి నచ్చచెపుతూచెపుతూ ఆమె అతనితో సెక్స్‌లో పాల్గొంటే అదీ వీళ్లకు తెలిసిపోయింది.
సాయంత్రమెప్పుడో డానా నిద్రలేచింది. మైక్‌తో యివాళ నేనిక్కడే వుండిపోతే నీకేమైనా అభ్యంతరమా? అని అడిగింది. మీ అమ్మకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకో అన్నాడతను. ఫోన్ చేసి అనుమతి అడుగుతూనే నాన్న ఉన్నాడా అని అడిగింది. ‘లేడు, ఎక్కడకు పోయాడో తెలియదు.’ అంది జెసికా నిరాశగా. ‘పోలీసు స్టేషన్ దగ్గర ఏం జరిగిందో తెలుసా అమ్మా, అక్కడకు క్యారీ వచ్చి ఏదో చెప్పి నాన్న మనసు మార్చేసింది. అందుకే నాన్న మాట తప్పాడు. ఇప్పుడు దానితోనే ఎక్కడికో పోయి వుంటాడు.’ అంటూ భోరుమంది డానా.
మర్నాడు ఉదయం బ్రాడీ నిద్ర లేచాక క్యారీ అతనితో ‘రోయాకు ఫోన్ చేసి మళ్లీ కాంటాక్ట్ పెట్టుకో’ అంది. సరే అని బ్రాడీ ఆమెకు ఫోన్ చేసి ‘నాకు యింటి దగ్గర మా అమ్మాయితో గొడవగా వుంది. అందుకే నిన్న అలా ప్రవర్తించాను. ఇవాళ కలుద్దాం.’ అన్నాడు. ఆమె సరే, ఫలానా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ప్లేస్‌కు రా అంది. అతను అక్కడకు రాగానే అతని కారెక్కి పోనీయ్ అంది. అతని సెల్‌ఫోన్ తీసుకుని దానిలో బ్యాటరీ తీసేసింది. దానితో సిఐఏతో అతనికి కాంటాక్ట్ పోయింది.
రాత్రి ఎవరితో గడిపావ్ అని రోయా అడిగితే క్యారీతో అని బ్రాడీ చెప్పేశాడు. మీరే కదా, ఆమెతో సంబంధం కొనసాగించమన్నారు, అయినా యివన్నీ మీరు అడగడమేమిటి అన్నాడు కోపం నటిస్తూ. ఎప్పుడైతే కాంటాక్ట్ పోయిందో క్యారీకి రోయాపై అనుమానం వచ్చింది. వర్జిల్తో బాటు ఓ వాన్లో కూర్చుని వాళ్లను అనుసరించింది. రోయా రోజంతా బ్రాడీని ఊరు మొత్తం తిప్పించి, చివరకు ఓ చోట రోడ్డు పక్కన ఆపించి, కారు దిగమంది. అక్కడకు గెట్టీస్బర్గ్లో అందర్నీ కాల్చినతను వచ్చి కలిశాడు.
‘అక్కడ ఏం జరుగుతోందో తెలియటం లేదు. మేం కారులోంచే వాళ్లను గమనిస్తూ ముందుకు సాగిపోతాం’ అని పీటర్‌కు చెప్పి క్యారీ వాన్‌ను వాళ్లకు పక్కగా పోనివ్వమంది. కారులోంచే వర్జిల్ ఆ వ్యక్తి ఫోటోలు తీశాడు. కాస్త దూరం వెళ్లాక క్యారీ వాన్ ఆపమంది. వాళ్లను అరెస్టు చేసేందుకు అనుమతి యివ్వమని పీటర్‌ను అడిగింది. అతను యివ్వనన్నాడు. ఆ మూడో వ్యక్తిని వెంటాడడమే మన లక్ష్యం అన్నాడు. అయినా మాట వినకుండా ఆమె వాన్ దిగి వాళ్లవైపు నడవసాగింది. అంతలోనే ఒక హెలికాప్టర్ ఆకాశం నుంచి వచ్చి ఆగింది. దిగినవాళ్లు బ్రాడీని నెట్టుకుంటూ దానిలోకి ఎక్కించుకుని ఎగిరిపోయారు.
ఉదయాన్నే నిద్ర లేచాక డానా మైక్‌తో మంచీచెడూ మాట్లాడింది. మా నాన్న తిరిగి వచ్చాకనే కష్టాలు చుట్టుముట్టాయి అని వాపోయింది. ఇంటికి దింపమని చెప్పి మధ్యదారిలో తను యాక్సిడెంటు చేసినామె యింటికి తీసుకెళ్లమంది. ఆమెను చూడగానే కూతురు ‘నువ్వే యాక్సిడెంటు చేశావని అప్పుడే గ్రహించాల్సింది.’ అంది. ‘నేను చంపలేదు, అప్పుడు కారులో ఉన్నానంతే. పశ్చాత్తాప పడుతున్నాను, నన్ను క్షమించు’ అంది. ‘అవన్నీ ఎందుకులే, వాళ్లెవరో కానీ బయటపడకుండా, మా కుటుంబానికి డబ్బు సాయం చేశారుగా, ఇక అందరం నోరు మూసుకుంటే మంచిది, వెళ్లు, మళ్లీ రాకు’ అని కటువుగా చెప్పింది. డానా ఏడుస్తూ కారెక్కి మైక్‌తో జరిగింది చెప్పింది. ఇంటికి వచ్చాక మైక్ జెసికాతో జరిగినదంతా చెప్పాడు.
బ్రాడీ మాయమై 12 గంటలు కావడంతో సిఐఏ టీములో ఆందోళన ప్రారంభమైంది. రోయాను అరెస్టు చేద్దామా అని ఆలోచిస్తూండగానే అతని నుంచి క్యారీకి ఫోన్ వచ్చింది. ‘నేను బాల్టిమోర్‌లో ఉన్నాను. మా కుటుంబాన్ని తక్షణం వేరే చోటికి తీసుకెళ్లి రక్షణ కల్పించండి. అప్పుడే జరిగినదేదో మీకు చెప్తాను.’ అన్నాడు. తను వెళితే వాళ్లు నమ్మరనే శంకతో క్యారీ మైక్‌కు చెప్పి అతన్ని పంపించింది. అతను వాళ్లందరికీ నచ్చచెప్పి, సిఐఏ ఏర్పాటు చేసిన ఒక యింటికి తీసుకుని వచ్చాడు. దాన్ని మేజర్ మెండెజ్ అనే ఆవిడ నడుపుతూంటుంది. డానాకు యిదంతా చికాగ్గా వుంది. తండ్రి నిర్వాకం చేతనే తమకీ అవస్థలని విసుక్కుంది. మైక్‌ను అక్కడే తమతో వుండమని జెసికా కోరింది. అతను సరేనన్నాడు.
సిఐఏ టీము బ్రాడీని విచారించింది. అతను ‘‘నజీర్ అమెరికాలో దిగాడు. గడ్డం, మీసం గీసేసి, కొత్త అవతారం ఎత్తాడు. కొత్త దాడికై ప్లాన్ చేశాడు. దానికి నీ సహకారం కావాలన్నాడు. నువ్వు దారి తప్పకుండా ఉంటే నీ కుటుంబానికి హాని కలగదు అన్నాడు. ఏమిటా దాడి అని అడిగితే చెప్పాడు –‘మిడిల్ ఈస్ట్ నుంచి 300 మంది యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ ట్రూప్స్ యింటికి వస్తున్నారు. వారి కుటుంబాలు వారిని ఆహ్వానించడానికి వస్తాయి. వైస్ ప్రెసిడెంట్ వాల్డెన్ వాళ్లను రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. అక్కడ మనం బాంబులు పేలుస్తాం. ఆ ఫంక్షన్ కవర్ చేసేందుకు ఎవర్నీ అనుమతించటం లేదు. కానీ రోయా అనే టీవీ జర్నలిస్టును మాత్రం అనుమతించండి అని నువ్వు వాల్డెన్ను కన్విన్స్ చేయాలి. అంతే నీ పని.’ అని నాకు చెప్పాడు.’’ అని వివరించాడు. నిన్ను హింసించారా అని అడిగితే ‘లేదు, కానీ చిత్రహింస పెట్టేట్లు భయపెట్టారు’ అన్నాడు.
అతన్ని పంపేసి, సిఐఏ టీము చర్చించింది. నజీర్ కానీ, బ్రాడీ కానీ తమను తప్పుదోవ పట్టిస్తున్నారా అని. ఏది ఏమైనా ప్రయత్నించి చూదాం, వాల్డెన్కు విషయం చెపుదాం. అనుమానం రాగానే రోయా టీమును బంధించి, బాంబులు పేలకుండా చేద్దాం. బహుశా నజీర్ అక్కడకు రావచ్చు, బంధిద్దాం అనుకున్నారు. ఆ విషయాన్ని చెప్పడానికి వాల్డెన్ను బ్రాడీ ఆఫీసుకి రప్పించారు. తన ఎదురుగా దాడి గురించి చెప్తున్నపుడు అదే మొదటిసారి వింటున్న బిల్డప్ యిచ్చాడు బ్రాడీ. వాల్డెన్ సరేనన్నాడు.
తర్వాత రోయాను బ్రాడీ కలిసి అనుమతి సంపాదించానని చెప్పాడు. ఎలా అని అడిగితే ‘నా వైస్ ప్రెసిడెంటు అభ్యర్థిత్వాన్ని ప్రకటించడానికి యిదే సరైన సమయమని వాల్డెన్ను కన్విన్స్ చేశాను‘ అని చెప్పాడు. ‘మంచిది, నువ్వు ఓ పని చేయి, బాంబులు పేలినప్పుడు నువ్వు కెమెరా సిబ్బంది ఉన్నచోట వుండు. అదే సురక్షితమైన ప్రదేశం.’ అని చెప్పింది రోయా.
బ్రాడీ పరిస్థతి యిలా వుండగా, అతని కుటుంబం సిఐఏ వారి సేఫ్‌హౌస్‌లో వుంది. డానా, జెసికా లిద్దరికీ మైక్ ఎంతో ఆత్మీయుడిగా తోచాడు. జెసికా అతనితో ఓ రాత్రి శృంగారంలో పాల్గొంది కూడా. మా నాన్న తిరిగి రాకుండా ఉంటే ఎంతో బాగుండేది అని డానా మైక్‌తో పదేపదే అంటోంది. సిఐఏ ఆఫీసు నుంచి బ్రాడీ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు తక్కినందరూ మాట్లాడారు తప్ప తను మాట్లాడనని చెప్పింది. క్రిస్‌కి మాత్రం యిలాటి ఆలోచనలేమీ లేవు. స్కూలుకి వెళ్లే అవకాశం లేదు కాబట్టి యింట్లోనే బుద్ధిగా చదువుకుంటున్నాడు.
తమ టీముకి నాయకత్వం వహిస్తున్న పీటర్ విషయంలో సాల్‌కు, క్యారీకి అంత నమ్మకం చిక్కటం లేదు. ఇతనెక్కడివాడు, డేవిడ్‌కు యింత ఆత్మీయంగా ఎలా మారాడు అన్నదానిపై పరిశోధించమని వర్జిల్ టీముని పురమాయించారు. వాళ్లు రకరకాలుగా ప్రయత్నించి, ఏమీ దొరక్క చివరకు అతని యింటిపై పడ్డారు. అతని యింట్లో అతని గురించిన వివరాలేవీ దొరకలేదు. పని పూర్తయ్యాక ఏ క్షణంలోనైనా మాయమయ్యేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నట్లుంది.
ఎవరైనా యింట్లో చొరబడితే కనుక్కోగలిగే సామగ్రి, రైఫిల్ క్లీనింగ్ సరంజామా కనబడ్డాయి. పిల్లాణ్ని ఎత్తుకున్న ఒకామె ఫోటో కనబడింది. దాన్ని ఫోటో తీసి, పట్టుకుని వచ్చి సాల్‌కు యిచ్చారు. ఫోటోలో ఆమె ఎవరాని రికార్డుల్లో చూస్తే ఆమె ఫిలడెల్ఫియా పోలీసు డిపార్టుమెంటులో పని చేసే జూలియా అని తెలిసింది. సాల్ ఆమె వద్దకు వెళ్లి తను ఇన్కమ్ టాక్స్ అధికారినని చెప్పుకున్నాడు కానీ ఆమె నమ్మలేదు.
పీటర్ ఫోటో చూపించి అడిగితే వివరాలేమీ పెద్దగా చెప్పలేదు కానీ మాటల సందర్భంగా పీటర్, జాన్ అనే పేరుతో ఆమెతో సంసారం చేసి కొడుకుని కన్నాడని, నాలుగేళ్లగా ఆమెతో టచ్‌లో లేడని అర్థమైంది. బయటకు రాగానే సాల్, వర్జిల్‌కు ఫోన్ చేసి, పీటర్‌కు యిప్పుడు వచ్చే ఫోన్‌ను ట్రేస్ చేయమన్నాడు. అంచనా వేసినట్లే ఆమె పీటర్‌కు ఫోన్ చేయడం, పీటర్ వచ్చినవాడి పోలికలేమిటని అడిగి, కంగారు పడకు, అన్నీ నేను చూసుకుంటానులే అని హామీ యివ్వడం జరిగాయి.
క్యారీతో ‘నాకు కాస్త పని వుంది, బయటకు వెళ్లి వస్తా’ అని చెప్పి బయటపడ్డాడు. అతను ఆమె దగ్గరకే వెళతాడేమో అనుకుంటూ వర్జిల్ టీము అతన్ని వెంటాడింది. అయితే పీటర్ ఒక బస్సులో కొంతదూరం వెళ్లి, దిగి, చొక్కా మార్చుకుని, మళ్లీ యింకో బస్సులో తిరుగుబస్సెక్కాడు. అది దాదాపు ఖాళీగా వుంది. దానిలో గడ్డం వున్న ఒక వ్యక్తితో రహస్యంగా మాట్లాడాడు. ఇదంతా గమనించిన వర్జిల్ ఆ వ్యక్తి ఫోటో తీసి, పట్టుకుని వచ్చి సాల్‌కు చూపించాడు.
సాల్ ఉలిక్కిపడ్డాడు. అతని పేరు డార్ (అడల్). సిఐఏ కొన్ని ఘాతుకకృత్యాలను స్వయంగా చేయకుండా యిలాటి వారికి కాంట్రాక్టుకి యిస్తూంటుంది. అతని కింద చాలామంది సాహసవంతులుంటారు. ఏ పని చేయడానికైనా వెరువరు. సాల్ అతన్ని 18 ఏళ్ల క్రితం నైరోబీలో కలిశాడు. పీటర్ అతన్ని కలిశాడంటే దాని అర్థం అతను ఎనలిస్టు కాదు, డార్ మనిషన్నమాట. మరి డేవిడ్ అతన్ని ఎందుకు తెప్పించాడు?
దాడి జరిగేరోజున వాల్డెన్, బ్రాడీలు వచ్చేముందే రోయా తన టీవీ ఛానెల్ టీముతో వచ్చి వుంటుంది కాబట్టి ఆమెను గమనించడానికి సిఐఏ టీములో కొందరు సభాస్థలికి వెళ్లారు. నజీర్ వచ్చాడేమో గమనించడానికి క్యారీ వెళ్లి అక్కడే మాటేసింది. డేవిడ్ పీటర్‌ను విడిగా పంపడం చూసి, సాల్ అతనికి అక్కడేం పని, యిక్కడుండి మానిటార్ చేయాలి కానీ అన్నాడు. ‘అతను సిఐఏకు, ఎఫ్‌బిఐకు మధ్య సంధానకర్తగా పని చేస్తున్నాడు, ఆ పని మీద బయటకు వెళ్లాడు’ అన్నాడు.
సాల్ ‘డెర్, పీటర్ కలుస్తున్నారు. పీటర్ సంగతంతా తమాషాగా వుంది.’ అన్నాడు. ‘మనందరిలాగానే పీటర్ కూడా టెర్రరిస్టులను చంపడానికే వచ్చాడు’ అంటూ డేవిడ్ సంభాషణ తుంచేశాడు. నిజానికి అతను పీటర్‌ను బ్రాడీ యింటికి కారులో పంపాడు. సమావేశం జరిగే చోటుకి స్వయంగా తీసుకెళ్లడానికి వచ్చానంటూ అతను బ్రాడీని కారెక్కించుకుని, నజీర్ పట్టుబడిన మరుక్షణం యితన్ని కాల్చి చంపేయాలని ఆదేశాలిచ్చాడు.
నజీర్ పట్టబడేంతవరకే బ్రాడీ అవసరం. తర్వాత కూడా బతికి వుంటే ఎప్పటికైనా డ్రోన్ దాడిలో తన పాత్ర గురించి, వాల్డెన్ పాత్ర గురించి బయటపెట్టే ప్రమాదం వుంది. అందుకే బ్రాడీని చంపేయాలని చెప్పాడు. మరో పక్క నజీర్ ఉద్దేశమూ యిలాటిదే. వాల్డెన్ చనిపోయాక బ్రాడీతో పని లేదు. అందువలన రోయాతో అతనికి సురక్షితంగా వుండాలంటే కెమెరా సిబ్బంది పక్కన వుండమని చెప్పించాడు. నిజానికి బాంబులు పేలేది అక్కడే.
రోయా టీవీ టీము సభాస్థలి వద్దకు వచ్చి తమ కెమెరా వ్యాన్‌ను ఓ చోట పార్క్ చేసి ఎదురుగా వున్న కఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఓ ఎస్యువి వచ్చి ఆ వ్యాన్ పక్కన ఆగింది. దానిలో గెట్టీస్బర్గ్లో దాడి చేసిన వ్యక్తి వున్నట్లు క్యారీకి కనబడింది. కారు కిటికీ అద్దాలు నల్లగా వుండడంతో వేరే ఎవరున్నారో తెలియలేదు. టీవీ వ్యాన్ లోంచి కెమెరా బ్యాటరీలు పట్టుకెళ్లి కారులో పెడుతున్నారు. కారులోంచి మరో రకమైన బ్యాటరీలు మోసుకొచ్చి వాటి స్థానంలో పెడుతున్నారు. కానీ కొత్త బ్యాటరీలు చాలా బరువుగా వున్నట్లు మోసేవాళ్ల చేష్టల బట్టి అర్థమవుతోంది.
ఇదంతా గమనిస్తున్న క్యారీ అవి బాంబులని గ్రహించింది. ఆధారం దొరికింది కదాని సిఐఏ టీముకి సైగ చేసింది. వాళ్లు రంగంలోకి దిగి వ్యాన్ని, దానిలోని మనుషులను, రోయాను అందర్నీ చుట్టుముట్టారు. ఈ హఠాత్ సంఘటనతో వ్యాన్ పక్కనే వచ్చి ఆగిన కారు తప్పించుకోబోయింది. టీము వాళ్లు దాన్ని ఆపారు. కారులో నజీర్ కూడా ఉన్నాడో లేదో చూడడానికి క్యారీ వెళ్లి పరీక్షించింది. నజీర్ లేడు. ఆ విషయం డేవిడ్‌కు చెప్పింది. అతను వెంటనే పీటర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అతనప్పటికే కారు డ్రైవింగ్ సీటులో కూర్చుని, సైలెన్సర్‌ను రహస్యంగా బ్రాడీవైపు ఎక్కుపెట్టి వున్నాడు. ‘అతనితో మనకింకా అవసరం ఉంది.’ అని డేవిడ్ చెప్పగానే, తుపాకీ దాచేశాడు.
సమావేశం తర్వాత బ్రాడీ తన కుటుంబం వున్నచోటికి రహస్యస్థలానికి వెళ్లాడు. మైక్‌తో నువ్వు చేస్తున్న సహాయానికి థాంక్స్ అన్నాడు. అంతకు ముందే మైక్, జెసికా తమ శృంగారం గురించి గిల్టీగా ఫీల్ కావలసిన అవసరం లేదని నిశ్చయించుకున్నారు. అందువలన మైక్ ‘దానికేముందిలే’ అంటూ బ్రాడీ కృతజ్ఞతను స్వీకరించి వెళ్లిపోయాడు. అతను వెళ్లాక జెసికా బ్రాడీని మనమిప్పుడు ఏం చేయబోతున్నాం అని అడిగింది. ఏమో నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు బ్రాడీ.
అంతలో క్యారీ నుంచి ఫోన్ వచ్చింది. ‘అగ్రిమెంటు ప్రకారం నువ్వు వైస్ ప్రెసిడెంటు నామినేషన్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పాలి.’ అని గుర్తు చేసింది. ‘అవును, ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి నా కుటుంబం మీదే ఫోకస్ చేస్తున్నాను కాబట్టి తప్పుకుంటున్నాను అని చెప్తాను.’ అన్నాడు బ్రాడీ. సరే అలాగే చేయి అంది క్యారీ. కారు డ్రైవ్ చేస్తూ బ్రాడీతో మాట్లాడి ఫోన్ కట్టేసిన మరుక్షణమే ఆమె కారును ఒక పెద్ద వాహనం వచ్చి గుద్దింది. కారులోంచి నజీర్ దిగి ఆమెను యీడ్చుకుంటూ తన కారులో లాక్కుని వెళ్లిపోయాడు. (సశేషం) (ఫోటో – కెమెరా బ్యాటరీలను బాంబులతో మారుస్తున్న దృశ్యం, ఇన్సెట్లో కొత్త అవతారంలో ఉన్న నజీర్)
–ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2020)
[email protected]