ఎర్రదండుతో గులాబీ పొత్తు లేదన్నట్టే!

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమతి తమతో పొత్తు పెట్టుకోవాలని, తమకు కొన్ని సీట్లు కేటాయించాలని, తద్వారా తాము అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు, ప్రభుత్వంలో మంత్రిపదవులను కూడా పంచుకోవాలని…

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమతి తమతో పొత్తు పెట్టుకోవాలని, తమకు కొన్ని సీట్లు కేటాయించాలని, తద్వారా తాము అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు, ప్రభుత్వంలో మంత్రిపదవులను కూడా పంచుకోవాలని ఇక్కడి వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. 

సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు కూడా గులాబీలతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో ఉన్నాయి. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, ఇంకా కుదరడం లేదని ఆ పార్టీలకు చెందిన నాయకులు చాలా సార్లుగా ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే మహారాష్ట్ర నుంచి ఊరూ పేరూ లేని వ్యక్తులు వచ్చినా సరే.. వారు అక్కడ చాలా ప్రముఖ నాయకులు అని ప్రకటించి.. వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్న కేసీఆర్.. తెలంగాణ వామపక్ష సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదు. 

మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తమ మద్దతుతో మాత్రమే భారాస గెలిచిందని, ఆ సందర్భంగా తాము ఏర్పరచుకున్న పొత్తు ఆ ఒక్క ఎన్నికకే పరిమితం కాదని.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని చెప్పుకుంటూ వామపక్ష పార్టీలు తమ కోరికను చాటుకుంటున్నా.. ఆయన పట్టించుకోవడం లేదు. తాజాగా ఎర్రదండుతో గులాబీల పొత్తు ఉండబోదని పరోక్ష సంకేతాలు అందించేలాగా మరో పరిణామం తేటతెల్లం అవుతోంది.

ఎలాగంటే- ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నకల్లో భారాస తరఫున పోటీచేసి, ఓడిపోయిన తెల్లం వెంకటరావు.. ఇటీవల కాంగ్రెసు పార్టీలో చేరారు. ఖమ్మం జిల్లాలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రైట్ హ్యాండ్ గా అందరూ పరిగణించే తెల్లం వెంకటరావు.. ఆయనతో పాటు రాహుల్ తో పార్టీ కండువా కప్పించుకుని, ఖమ్మం సభలోనే చేరడం జరిగింది. ఇంకా నెలలు కూడా గడవనే లేదు. అప్పుడే ఆయన తిరిగి భారసలోకి వచ్చేస్తున్నారు. 

కాంగ్రెసు పార్టీలో ఆయనకు భద్రాచలం నుంచి సీటు గ్యారంటీ లభించ లేదని, అందుకే తిరిగి భారాసలోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గులాబీ దళం నుంచి భద్రాచలం సీటు గ్యారంటీ హామీ తీసుకున్న తరువాతనే ఆయన తన రాకను ధ్రువీకరించారని కూడా తెలుస్తోంది.

తెల్లం వెంకటరావు తిరిగి భారాసలోకి రావడానికి, వామపక్షాలతో పొత్తులు లేకుండాపోవడానికి ఏంటి సంబంధం అని అనిపించవచ్చు. పృష్టతాడనాత్ దంత భంగః సిద్ధాంతం అంటే అదే. ఎలాగంటే.. వామపక్షాలు గులాబీల పొత్తులు కుదిరితే గనుక.. వారు ఖచ్చితంగా డిమాండ్ చేసే సీట్లలో భద్రాచలం కూడా తప్పకుండా ఉంటుంది. గత ఎన్నికల్లోనే అక్కడ సీపీఎం తరఫున పోటీచేసిన సీనియర్ నాయకుడు మిడియం బాబూరావుకు 14 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. పొత్తు కుదిరితే గనుక..అలాంటి సీటును వారు వదలుకోరు.

కానీ ఇప్పుడు తెల్లం వెంకటరావుకు అక్కడ సీటు హామీ ఇచ్చి భారాస తిరిగి తమ జట్టులోకి తీసుకువస్తున్నదంటే.. ఇండైరక్టుగా ఎర్రదండుతో పొత్తు ఆలోచన లేనేలేదని చెబుతున్నట్టే. వామపక్ష పార్టీలు ఇక కేసీఆర్ మీద ఆశలు వదలుకుని.. ఎన్నికల్లో తాము స్వతంత్రంగా పోటీచేయాలో లేదో తేల్చుకుంటే వారికే మంచిది. లేకపోతే.. గులాబీ దళపతి గ్రీన్ సిగ్నల్ కోసం వేచిచూడడంలోనే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది.