రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం పేరుని సడన్ గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకుల పేరుని తొలగించడం బీజేపీకి ఎంత తేలికో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడెందుకు సడన్ గా రాజీవ్ పై మోదీకి కోపమొచ్చిందా అనే అనుమానం అందరికీ వచ్చింది.
అయితే అక్కడ పాయింట్ వేరే ఉంది. అదే ధ్యాన్ చంద్. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పేరుని అత్యున్నత క్రీడా పురస్కారానికి ముందు తగిలించడం మోదీ చేసిన మంచి పనే. అయితే ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఎందుకు మోదీకి ధ్యాన్ చంద్ గుర్తొచ్చారనేది ఇప్పుడు అసలు ప్రశ్న?
ఒకే దెబ్బకు రెండు పిట్టలు..
సాధారణంగా రాజీవ్ పేరుని తీసేస్తే కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది. కానీ ఇప్పుడు కిక్కురుమనకుండా ఉంది. ఎందుకంటే ధ్యాన్ చంద్ పేరుని దానిముందు పెట్టారు కాబట్టి కాంగ్రెస్ నాయకులెవరూ ఇంకా బయటపడి విమర్శలు మొదలు పెట్టలేదు. బీజేపీ రాజకీయ క్రీడను ఎండగట్టలేదు. తాజాగా టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా, మహిళల హాకీ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.
ఈ సందర్భం చూసుకుని మరీ మోదీ పేరు మార్చేశారు. రాజీవ్ గాంధీని తీసి పక్కనపెట్టి ధ్యాన్ చంద్ ని ఆ స్థానంలో పెట్టారు. దీంతో బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కి బీజేపీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇదని తెగ పొగిడేస్తున్నారు.
అసలు కథ అదేనా..?
రాజీవ్ పేరు తీసేసారు సరే, ధ్యాన్ చంద్ పేరుని సందర్భం చూసి ఎందుకు పెట్టారు అనుకుంటున్న క్రమంలో అసలు సంగతి ఇదీ అని తేల్చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. సీఎం యోగీకి ఈసారి ఛాన్స్ లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో యూపీవాసుల్ని మచ్చిక చేసుకోడానికే మోదీ ఈ ప్లాన్ వేశారని అంటున్నారు.
ధ్యాన్ చంద్ పుట్టిన ఊరు యూపీలో ఉంది. అందుకే యూపీకి చెందిన క్రీడాకారుడికి అత్యున్నత గౌరవం అంటూ మోదీ డబుల్ గేమ్ ఆడారని అంటున్నారు నెటిజన్లు. ఎన్నికలప్పుడు ఇలాంటి జిమ్మిక్కులు చేయడం ఆయనకు బాగా అలవాటేనంటున్నారు. మొత్తమ్మీద ఖేల్ రత్న పేరు మార్చి, మోదీయే అసలైన ఖేల్ రత్న అనిపించుకున్నారు.