అయితే ఆట, లేకపోతే తూటా.. మోదీకి అవే ఊరట

దేశవ్యాప్తంగా మోదీ సర్కారుపై విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ, సరిహద్దుల్లో తూటా పేలితే చాలు మోదీకి ఒకింత ఊరట. దాన్ని అడ్డం పెట్టుకుని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేది తామేనంటూ బిల్డప్ ఇచ్చి అసలు సమస్యల్ని పక్కదారి…

దేశవ్యాప్తంగా మోదీ సర్కారుపై విమర్శలు వెళ్లువెత్తుతున్న వేళ, సరిహద్దుల్లో తూటా పేలితే చాలు మోదీకి ఒకింత ఊరట. దాన్ని అడ్డం పెట్టుకుని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేది తామేనంటూ బిల్డప్ ఇచ్చి అసలు సమస్యల్ని పక్కదారి పట్టించేస్తుంటారు బీజేపీ నేతలు. గతంలో కూడా ఇలాంటివే జరిగినా మోదీ అధికారంలోకి వచ్చాక అసలు సరిహద్దు వివాదాలే కేంద్ర ప్రభుత్వ విజయాలుగా చెప్పుకుంటున్నారు. 

దేశం లోపల ప్రజలు అల్లాడుతున్నా పర్లేదు, సరిహద్దుల్లో గందరగోళం ఉంటే దాన్ని క్యాష్ చేసుకుంటుంది బీజేపీ. సరిగ్గా ఎన్నికల వేళ ఇలాంటి వ్యవహారాలు తెరపైకి రావడం, దాంతో దేశ ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగడం, ఆ ఉప్పొంగిన భక్తిని ఓట్ల రూపంలో బీజేపీ మార్చుకోవడం ఇవన్నీ సహజ పరిణామాలే.

సరిహద్దుల్లో పేలే తూటాలే కాదు, మన క్రీడాకారులు ఆడే ఆటలు కూడా పరోక్షంగా బీజేపీకే ప్లస్ పాయింట్ గా మారుతున్నాయి. అలా మార్చేసుకుంటున్నారు మహానుభావులు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. పెగాసస్ కుంభకోణం ఓవైపు కుదిపేస్తోంది, మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు ఊపిరాడనివ్వడం లేదు. 

ఇంకోవైపు అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న పెట్రో రేట్లతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ దశలో ఒలింపిక్స్ లో మనోళ్లు అదరగొట్టారు. వ్యక్తిగత ఈవెంట్లు, గ్రూప్ ఈవెంట్లలో పతకాల మోత మోగింది. దీంతో ఆ క్రెడిట్ అంతా బీజేపీ నేతలు తమ జేబులో వేసుకుంటున్నారు.

ఒలింపిక్స్ లో భారత్ విజయం, బీజేపీ విజయంగా ప్రచారం జరుగుతోంది. ఊరూవాడా బీజేపీ నేతలు మన క్రీడాకారుల్ని అభినందిస్తూ పెడుతున్న పోస్టింగ్ లు, హోర్డింగ్ లు, అభినందన కార్యక్రమాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. బీజేపీ వల్లే ఒలింపిక్స్ లో పతకాలొచ్చాయనే రేంజ్ లో ఈ ప్రచారం సాగుతోంది. అవి క్రీడాకారులు గెలిచిన పతకాలు కావు, మన రాజకీయ నాయకులు సాధించిన విజయాలుగా చెప్పుకుంటున్నారు.

సమస్యలు చుట్టుముడుతున్న వేళ మోదీకి ఒలింపిక్స్ అక్కరకొచ్చాయి. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే మరో అవకాశం అందొచ్చింది. క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పడం, వారికి ఐస్ క్రీమ్ ఆఫర్ చేయడం, వారితో కలసి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం, వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించడం.. ఇలా మరో రెండు వారాలు మోదీ హంగామా ఉంటుంది.

ఎంచక్కా పార్లమెంట్ సమావేశాలను దాటేయొచ్చు. అప్పటి వరకూ సమస్యలన్నీ పక్కదారి పట్టినట్టే. కాదు, కూడదంటారా మీకు దేశభక్తి బొత్తిగా లేనట్టే.