మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలియదు కానీ, కరెన్సీ నోట్లకు మాత్రం ఓట్లు రాలే కాలమే ఇది. డబ్బులిచ్చినోళ్లకే ఓట్లు, ఒకవేళ పోటాపోటీగా రెండు వర్గాలు డబ్బులు పంచితే అప్పుడు నచ్చినోళ్లకి మాత్రమే ఓట్లు అని అంటున్న రోజులివి.
ఓటర్ల బలహీనతను అలుసుగా తీసుకుని రాజకీయ పార్టీలు కూడా చెలరేగిపోతుంటాయి. అధికారంలో ఉన్నవారైతే ఓ అడుగు ముందుకేసి, అధికారికంగా పంచుడు కార్యక్రమం మొదలు పెడతారు.
కేసీఆరే ఆదర్శం..
దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రకటించిన వరాలను ఎవరూ మరచిపోలేదు. పార్టీ ఓడిపోయే సరికి సారు దుబ్బాకను పూర్తిగా మరచిపోయారు. కట్ చేస్తే ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. సరిగ్గా ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలొచ్చాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీపై సర్వత్రా వ్యతిరేకత పెరిగింది.
ఆ పాపాన్ని కుటుంబానికో 10వేలు ఇచ్చి కడిగేసుకోవాలనుకున్నారు కేసీఆర్. జనమంతా ఆధార్ కార్డులు తీసుకుని మీసేవా కేంద్రాల ముందు క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లోనైనా నేరుగా చేతికే డబ్బులిచ్చారు కూడా. ఎన్నికల నియమావళి అడ్డుగా ఉందని తెలిసి కూడా కేసీఆర్ ఆ సాహసం చేశారు, ఓటుకు నోటుని అధికారికం చేయాలనుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.
అంతకు ముందు ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో 55కి పరిమితం కావాల్సి వచ్చింది. 10వేల రూపాయల ప్లాన్ ఘోరంగా ఫ్లాపయింది.
పంచితే సరిపోదు, మంచి కూడా చేయాల్సిందే..
సరిగ్గా హుజూరాబాద్ ఎన్నికల వేళ కేసీఆర్ కి దళితులపై ప్రేమాభిమానాలు పొంగిపోవడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కి ప్రాంతాల వారీగా, కులాల వారీగా అభిమానం అలా వెల్లువై పారుతుంది. కానీ ఈసారి అది లిమిట్స్ క్రాస్ చేసింది.
జీహెచ్ఎంసీలో కుటుంబానికి 10వేలు అని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రమంతా దళిత కుటుంబాలకు 10లక్షల రూపాయలిచ్చి దళిత బంధువైపోతానంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా లేదు కాబట్టి, అనుకున్నదే తడవుగా వాసాలమర్రి గ్రామం నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలు బదిలీ చేసే కార్యక్రమం సాగిపోతోంది.
10వేలతో పోల్చుకుంటే 10లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్. దాంతో దళితుల కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయని చెప్పలేం కానీ, సద్వినియోగం చేసుకుంటే ఆయా కుటుంబాల భవిష్యత్ మారిపోతుంది. అదే దుర్వినియోగం అయితే ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుంది. అయితే అయింది కానీ హుజూరాబాద్ లో ఓట్లు వస్తే చాలనుకుంటున్నారు కేసీఆర్. కేవలం ఈటల రాజేందర్ పై పగతో, ఆయన్ను ఓడించాలనే కక్షతోనే కేసీఆర్ అర్జెంట్ గా దళితబంధువై పోయారనేది బహిరంగ రహస్యం.
నిజంగానే దళితులపై కేసీఆర్ కి అంత ప్రేమ ఉంటే, అప్పట్లో దళిత సీఎం అంటూ చేసిన వాగ్దానాన్ని ముందుగా నెరవేర్చేవారు. అయిందేదో అయిపోయింది, జనం అన్నీ గుర్తుంచుకుంటారనుకోలేం. నాయకులకు ఓటు స్వార్థం, ఓటర్లకు నోటు స్వార్థం.
దళిత అభ్యర్థి సంగతేంటి మరి..!
అంతా బాగానే ఉంది, కేసీఆర్ అనుకున్నట్టుగానే ఎన్నికలకు ముందుగా రూ.10లక్షలు దళిత కుటుంబాలకు వెళ్లిపోతున్నాయి. హుజూరాబాద్ లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు రిజర్వేషన్ లేకపోయినా అక్కడ దళిత అభ్యర్థిని నిలబెడితే కేసీఆర్ కి నిజంగా వారిపై ప్రేమ ఉన్నట్టు లెక్క. అలా చేయకుండా తన చెప్పుచేతల్లో ఉండే అభ్యర్థిని నిలబెట్టి, దళితుల ఓట్లకు లెక్కకడితే మాత్రం అది దొంగ రాజకీయమే.
ఈటల గోడ గడియారాలు పంచితేనే నానా హంగామా చేశారు, ఓటుకి గడియారం అంటూ రచ్చ చేశారు. మరిప్పుడు కేసీఆర్ అధికారికంగా 10లక్షలు పంచిపెడితే ఏమనాలి. “దళితులు బాగుపడితే చూడలేరా? దళితుల ఆర్థిక స్వావలంబన మీకు నచ్చదా? మీ అగ్రవర్ణాల దురహంకారం ఇంకా ఎన్నాళ్లు..?” ఇలాంటి పడికట్టు డైలాగులు ఎలాగూ ఉంటాయి. కానీ అంతిమంగా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేదే ఇక్కడ ముఖ్యం.
ఇప్పటి వరకూ ఓటుకి నోటే, ఇప్పుడు ఓటుకి నోట్ల కట్ట అంటూ కొత్త రాజకీయానికి తెరతీసిన కేసీఆర్ కి హుజూరాబాద్ ప్రజలు ఎలాంటి మధురానుభూతి మిగులుస్తారో చూడాలి.