Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: ఎస్.ఆర్. కళ్యాణమండపం

మూవీ రివ్యూ: ఎస్.ఆర్. కళ్యాణమండపం

చిత్రం:​ ఎస్.ఆర్, కళ్యాణమండపం
రేటింగ్: 2.5/5
తారాగణం: కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవల్కర్, సాయికుమార్, తులసి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు
ఎడిటింగ్: శ్రీధర్ గాదె
కెమెరా:విశ్వాస్ డేనియల్ 
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ 
సంభాషణలు: కిరణ్ అబ్బవరం 
నిర్మాతలు: ప్రమోద్, రాజు 
దర్శకుడు: శ్రీధర్ గాదె
విడుదల తేదీ: 6 ఆగస్ట్ 2021

"రాజావారు రాణిగారు" సినిమాతో నలుగురికీ కాస్త తెలిసిన కిరణ్ అబ్బవరం "ఎస్.ఆర్. కల్యాణమండపం" తో ముందుకొచ్చాడు. పాటలు హిట్టైన కారణంగా ఈ సినిమాపై యువప్రేక్షకుల కళ్లు పడ్డాయి. కిరణ్ అబ్బవరంలో సహజంగానే టాలెంట్ ఉండడం, యువతకి నచ్చే ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ అవ్వడం, వేరే పెద్ద సినిమాలేవీ లైన్లో లేకపోవడంతో దీనిపై యంగ్ ఆడియన్స్ దృష్టి పడింది. కనుక వాళ్లే ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్. మరి వాళ్లకి నచ్చే విధంగా, వాళ్లు మెచ్చే విధంగా ఈ సినిమా ఉందా అనేది చూద్దాం. 

కళ్యాణ్ (కిరణ్) బాగా బతికి చితికిపోయిన ధర్మ (సాయికుమార్) కి కొడుకు. కళ్యాణ్ తాత ఎస్.ఆర్.కళ్యాణమండపం ఓనర్. అతను బాగా సంపాదించి పోయాడు. ఆయన కొడుకు తండ్రి సంపాదనని ఖర్చులు పెట్టి, దానాలు చేసి చితికిపోయాడు. చేసేది లేక ఉన్న కళ్యాణమండపాన్ని కూడా తాకట్టు పెట్టే పనిలో ఉంటాడు. కానీ కళ్యాణ్ ఆ పరిస్థితి రాకుండా దానిని నిలబెట్టుకుంటాడు. 

ఇదిలా ఉంటే సింధు (ప్రియాంకా) కాస్త బాగా సంపాదించుకున్నవాడి (శ్రీకాంత్ అయ్యంగర్) కూతురు. ఈమెకి, కళ్యాణ్ కి లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. కళ్యాణ్ కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని తండ్రి సహజంగానే హీరోపై తిరగబడతాడు. చివరికి కథ సుఖాంతమవుతుందా లేదా అనేది తెరమీద చూడాలి. 

కథ పరంగా చూస్తే కొత్తదనమేమీ లేదు. నిజంగానే ఇలాంటి కథలు కొన్ని వందలొచ్చాయి. కానీ కథనంతోనూ, బ్యాక్ డ్రాప్ తోనూ, డయలాగ్ తోనూ, ఎమోషన్ తోనూ ఆకట్టుకోవాలి. దర్శకుడి పని అదే. ఆ విషయంలో దర్శకుడు చాలావరకు సక్సెస్ అయినా, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యడని చెప్పాలి. 

రాయలసీమ యాసలో సంభాషణలు సాగడం వల్ల కొత్త ఫ్లావర్ అద్దినట్టయ్యైంది. అది కూడా స్వయంగా హీరొనే సంభాషణల రచయిత కావడం మరొక విశేషం. కిరణ్ అబ్బవరంలో ఉన్న టాలెంట్ లకి ఈ సినిమా ఒక షో రీల్ అనుకోవచ్చు.  గతంలోనూ నాని, శ్రీవిష్ణు వంటి వాళ్లు రాయలసీమ యాసతో మంచి ప్రయోగాలే చేసినా ఇక్కడ కిరణ్ అబ్బవరం సహజంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన నటుడే కాబట్టి ఎక్కడా కృతకంగా అనిపించదు. 

80, 90 ల నాటి సినిమా పాటలు గుర్తు చేస్తూ హీరోయిన్ నడుము సబ్జెక్ట్ గా లవ్ ట్రాక్ ని, ఫైట్స్ ని నడిపిస్తూ కమెర్షియల్ ఫార్ములాతో ఫస్టాఫులో చాలా భాగం నడిపాడు దర్శకుడు. హీరోయిన్ నడుమనగానే ఖుషీలో ఒక సన్నివేశం గుర్తురావడం సహజం. దానిని కూడా వదలకుండా కథనంలోకి జొప్పించడం జరిగింది. ఇలా నడుస్తున్న కథలో సంకీర్త్ అనే పాత్ర వస్తుంది. ఆ పాత్రకి ఏ వెన్నల కిషోరో అయ్యుంటే మరింత బలం చేకూరేది. మంచి కామెడీ వర్కౌట్ చేయగల పాత్రని సాదాసీదాగా లాగించి నీరుగార్చేసారు. 

కానీ సెకండాఫులో సడెన్ గా లవ్ ట్రాక్ సైడ్ ట్రాక్ అయ్యి ఫాదర్ సెంటిమెంట్ తెరమీదికొస్తుంది. అక్కడ ఇక కిరణ్, సాయి కుమార్ ల పర్ఫామెన్సులకి స్కోప్ పెట్టారు. ఏకపాత్రాభినయం లాంటి సింగిల్ షాట్ సీన్లో కిరణ్ అబ్బవరం తండ్రి గురించి ఎమోషనల్ డయలాగ్ చెబుతూ మార్కులు బాగానే కొట్టాడు. మొత్తానికి హీరోయిన్ నడుముతో మొదలైన సినిమా తండ్రి సెంటిమెంటుతో ముగుస్తుంది. 

మంచి ప్రయత్నమే చేసినా, ఆడియో హిట్టైనా, టైం కలిసొచ్చి వేరే సినిమాలేవీ లేకపోయినా, ఆర్టిస్టుల పర్ఫామెన్సులు బాగున్నా ఈ సినిమా కేవలం పర్వాలేదనిపిస్తుంది తప్ప అద్భుతం అనిపించదు. కంటికి, చెవులకి, సింక్ అయ్యేలా సీన్స్ ఉన్నా మైండ్ కి, మనసుకి మాత్రం కామెడీతో పాటు కొన్ని ఎమోషన్స్ హత్తుకోవు (చివర్లో హీరో సింగిల్ షాట్ డయలాగప్పుడు తప్ప). 

పైగా ఈ హీరో మీద అవసరమైనదానికంటే కాస్త ఎక్కువ హీరోయిజం పెట్టారు. కొత్త హీరో కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా వల్నరెబుల్ గా ఉండాలి తప్ప పెద్ద కమెర్షియల్ హీరో టైపులో ఫైట్స్ అవీ చేస్తుంటే యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది..ఒకవేళ ఇవన్నీ పెట్టాలనుకుంటే కనీసం మిడ్ రేంజ్ హీరోతో ప్లాన్ చేసుకోవాలి. ఇవి కమెర్షియల్ సినిమా మేకింగులో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రాధమిక అంశాలు. 

టెక్నికల్ గా చూస్తే మ్యూజిక్ హైలైట్. ఆరెక్స్ 100 ఫేం చైతన్ భరద్వాజ్ పాటలు క్రిస్టల్ క్లియర్ గా బాగున్నాయి. రెండు పాటల్లో సాహిత్యం కూడా బాగానే ఉంది.  ఎడిటింగ్ కత్తెరకి పదును తక్కువయ్యింది. దర్శకుడే ఎడిటరైతే సమస్య ఇదే. తీసిన సీన్స్ కట్ చెయ్యాలనిపించదు. ఫలితంగా అక్కర్లేని నిడివి పెరుగుతుంది. మిగతా విభాగాలు ఓకే. 

సాయి కుమార్, కిరణ్ మంచి పర్ఫామెన్స్ ఇస్తే కిరణ్ ఫ్రెండ్స్ గా నటించినా వాళ్లు పర్వాలేదనిపించారు తప్ప మెరుపులు మెరిపించలేకపోయారు. హీరోయిన్ ప్రియాంకా మాత్రం ఒళ్లు చేసి హీరో పక్కన పెద్దగా కనపడింది. తెర మీద కనిపిస్తున్న పాత్రధారులందరికీ భిన్నంగా ఆడ్ గా కనిపించింది హీరోయిన్ మాత్రమే. ఆమె పాత్రని రాసుకున్న తీరు కూడా పేలవంగానే ఉంది. 

తీరుబడిగా ఓటీటీలో కూడా చూడొచ్చు. థియేటర్లోనే చూడాల్సిన ఎఫెక్ట్స్ ఇందులో ఏమీ లేవు. 

బాటం లైన్: బాజాలు మోగని కళ్యాణమండపం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?