చాలా మంది హీరోయిన్లు తమ బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ఇచ్చే పరమ రొటీన్ స్టేట్ మెంట్ నే ఇచ్చింది కియరా అద్వానీ. ఇప్పుడు సౌత్ లో , నార్త్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలుగుతున్న కియరా కు లవ్ ఎఫైర్ అంటూ ఒక ప్రచారం ఉంది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా ప్రేమలో ఉందనే ప్రచారం పాతదే. బాలీవుడ్ లో ఇప్పుడు లవ్లీ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకటని మీడియా చెబుతూ ఉంటుంది.
కత్రినా కపూర్ – విక్కీ కౌశల్, కియరా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా.. ఈ జంటల గురించి తరచూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇలా బాలీవుడ్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది కియరా- సిద్ధార్థ్ ల జంట. తరచూ బయట కలిసి కనిపిస్తూ ఉంటారు కూడా.
మరి ఈ అంశం మీదే తాజా గా కియర మాట్లాడుతూ, సిద్ధార్థ్ కేవలం తనకు ఒక స్నేహితుడు మాత్రమే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయిత అత్యంత ఆప్తుడైన స్నేహితుడతను అంటూ కూడా కియరా యాడ్ చేసింది.
సన్నిహితుడిగా మెలిగే మగాడిని బయట వాళ్లంతా ప్రేమికుడు అని అంటున్నా.. అబ్బే అలాంటిదేమీ లేదు, తమది స్నేహం మాత్రమే అని చెప్పే హీరోయిన్లు ఇది వరకూ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాతి కాలాల్లో అలాంటి వ్యవహారాలు అనేక మలుపులు తిరుగుతూ ఉంటాయి. కొన్ని స్నేహాలు ప్రేమలుగా మారితే, మరి కొన్ని సమయాల్లో బ్రేకప్ సమయం ఆసన్నమయినప్పుడు హీరోయిన్లు ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తూ ఉంటారు. మరి ఇంతకీ కియరా మాటల అంతరార్థం ఏమిటో!