రానురాను చిరంజీవి సినిమాల్లో ఫిమేల్ లీడ్స్ ను వెదికి పెట్టడం మేకర్స్ కు తలకుమించిన భారంగా మారుతోంది. ప్రతి సినిమాకు హీరోయిన్ సమస్య ఎదురవుతోంది. తాజాగా చిరంజీవి చేయబోయే కొత్త సినిమాకు అతి కష్టమ్మీద్ద కీర్తిసురేష్ ను ఒప్పించారు. అయితే ఇందులో ఆమె చిరంజీవికి జోడీ కాదు, చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది.
త్వరలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ను స్టార్ట్ చేయబోతున్నారు చిరు. లూసిఫర్, వేదాళం రీమేక్స్ రెండూ సమాంతరంగా తెరకెక్కుతాయనే టాక్ కూడా నడుస్తోంది. ఈ సంగతి పక్కనపెడితే.. ఇందులో కీలకమైన చెల్లెలి పాత్ర కోసం కీర్తిసురేష్ ను ఒప్పించగలిగారు. దాదాపు 6 నెలలుగా జరుగుతున్న ఈ చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి.
నిజానికి ఈ పాత్ర కోసం సాయిపల్లవిని కూడా ట్రై చేశారు. కానీ ఆమె కంటే కీర్తిసురేష్ పైనే మెహర్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అనుకున్నది సాధించాడు. ఈ రీమేక్ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటోంది కీర్తి. నవంబర్ నుంచి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారువారి పాట సినిమా చేస్తోంది కీర్తిసురేష్. ఈ మూవీతో పాటు మరో పెద్ద సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించింది. ఇప్పుడు వీటికి అదనంగా వేదాళం రీమేక్ కు కూడా సైన్ చేసింది.