బాగా చదువుకునే పిల్లలు ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్దామా అని ఆశపడుతుండారు, మొద్దబ్బాయిలు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మాత్రం స్కూల్ కి సెలవు ఎప్పుడు వస్తుందా అని ఆశపడతారు. ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతుండటం, ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యం అవడంతో.. ఈనెల 16నుంచి స్కూల్స్ మొదలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కొన్ని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. వాస్తవానికి ఈ దశలో లోకేష్ రంగప్రవేశం చేయాల్సి ఉంది. జూమ్ మీటింగ్ లు పెట్టి, ఎల్కేజీ పిల్లలతో ''మాకు స్కూల్స్ వద్దు మామయ్య'' అని చెప్పించి హంగామా చేయాల్సి ఉంది. కానీ ఇంకా లోకేష్ ఎందుకో రంగంలోకి దిగలేదు.
ఏపీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆగస్ట్ 15 లోపు స్కూల్ టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసి 16 నుంచి తరగతి బోధన మొదలు పెట్టాలనేది ప్రభుత్వం ఆలోచన. దీనికి సంబంధించి ఏర్పాటన్నీ చకచకా సాగిపోతున్నాయి. అదే రోజున నాడు-నేడు పనుల్ని ప్రజలకు అంకితం చేసి ఫేజ్-2 పనుల్ని లాంఛనంగా సీఎం మొదలు పెట్టాల్సి ఉంది.
ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతుంది అని తెలిసి లోకేష్ ఊరికే ఉంటారనుకోవడం పొరపాటే. నాడు-నేడుపై బురద జల్లడానికైనా ఆయన కలుగులో నుంచి బయటకు వస్తారు. మాకీ స్కూళ్లు వద్దు అంటూ హంగామా చేస్తారు. నూతన విద్యా విధానంపై కూడా లోకేష్ ఏవో తనదైన విశ్లేషణలు సిద్ధం చేసుకున్నారు.
టెన్త్ పరీక్షల రద్దు ఎఫెక్ట్ బాగా పనిచేసిందా..?
ఇటీవల పదో తరగతి పరీక్షల రద్దు కోసం లోకేష్ ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. జూమ్ మీటింగ్ లు పెట్టి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని రెచ్చగొట్టి, కోర్టుల్లో కేసులు వేయించి మరీ పరీక్షల్ని అడ్డుకున్నారు. అటు ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసిందో లేదో.. ఇటు కరోనా కేసులు క్రమంగా తగ్గాయి, లాక్ డౌన్ ఎత్తేశారు, పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు కూడా పెట్టారు.
కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్షాల రాద్ధాంతం వల్ల టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో లోకేష్ సహా టీడీపీ బ్యాచ్ అంతా తల్లిదండ్రులతో చీవాట్లు తినాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు స్కూల్స్ వద్దు అని ఉద్యమం మొదలు పెడితే మరిన్ని తిట్లు తినాల్సి వస్తుందేమోనని లోకేష్ ఆలోచనలో పడ్డారు. లేకపోతే టీడీపీ స్కూల్ వ్యతిరేక ఉద్యమం ఈపాటికే జూమ్ లో జామ్ జామ్ గా మొదలయ్యేది.