దారుణం.. అమెరికాలో లక్షకు చేరిన మృతులు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలోనే దారుణమైన దుర్ఘటన ఇది. కనీవినీ ఎరుగని ఉత్పాతం ఇది. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాను కరోనా వైరస్ చావుదెబ్బ తీసింది. ప్రపంచంలో ఏ దేశానికి జరగనంత నష్టం…

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలోనే దారుణమైన దుర్ఘటన ఇది. కనీవినీ ఎరుగని ఉత్పాతం ఇది. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాను కరోనా వైరస్ చావుదెబ్బ తీసింది. ప్రపంచంలో ఏ దేశానికి జరగనంత నష్టం అమెరికాకు జరిగింది. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యంలో మరణించిన వారి సంఖ్య తాజాగా లక్షకు చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అమెరికాలో మరో 774 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 100,572కు చేరుకుంది. అటు కొత్తగా మరో 19,049 కేసులు నమోదవ్వడంతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17లక్షల 25వేలను దాటింది. కరోనా దెబ్బకు అమెరికాలోని న్యూయర్క్ రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే కరోనా మృతుల సంఖ్య 29వేలకు పైగా ఉంది. 3 లక్షల 70వేల మందికి వైరస్ సోకింది.

ఇక అమెరికా తర్వాత బ్రెజిల్ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఆ దేశంలో రోజురోజుకు వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. నిన్న ఒక్కరోజే బ్రెజిల్ లో 15,691 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 4 లక్షలకు చేరువైంది. అటు రష్యాలో కూడా గడిచిన 24 గంటల్లో 8915 కొత్త కేసులు నమోదై.. కేసుల సంఖ్య 3లక్షల 62వేలకు చేరుకుంది.

ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలో కరోనా అదుపులోకి వచ్చింది. ఫ్రాన్స్ లో నిన్న ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అటు ఇటలీ, జర్మనీలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పటికే కరోనా సోకిన వ్యక్తుల్ని కాపాడుకోవడం ఈ దేశాలకు పెద్ద భారంగా మారింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 215 దేశాలకు కరోనా వ్యాపించింది. 56 లక్షల 84వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా.. ఇప్పటివరకు 352,225 మంది మృత్యువాతపడ్డారు. 24లక్షల 30వేల మందికి పైగా కోలుకున్నారు. 

మన పాలన-మీ సూచన, 2వ రోజు