దేశంలో లాక్ డౌన్ మినహాయింపుల్లో ముందుంది కర్ణాటక. అవతల మోడీ ప్రకటించిన లాక్ డౌన్ ను ఆయన వ్యతిరేక పార్టీలు ఏలుతున్న రాష్ట్రాల్లో సరిగా పాటించడం లేదని కొందరు మోడీ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేరళ, బెంగాల్ లను వారు బోలెడన్ని విషయాల్లో నిందిస్తూ ఉన్నారు. లాక్ డౌన్ ను ఆ రాష్ట్రాలు సరిగా అమలు చేయడం లేదని విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే అందరి కన్నా ముందు మినహాయింపుల విషయంలో వేగంగా ఉంది మరే రాష్ట్రమో కాదు, బీజేపీ పాలిత కర్ణాటకే!
తొలి మూడు వారాల లాక్ డౌన్ ముగియగానే కర్ణాటకలో రకరకాల మినహాయింపులు ఇచ్చారు. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ల ప్రకటనలు వచ్చాకా.. గ్రీన్ జోన్లలో అన్ని చాలా రకాల యాక్టివిటీస్ కు ముందుగా పచ్చ జెండా ఊపింది యడియూరప్ప ప్రభుత్వమే. రెండో దశ లాక్ డౌన్ లో చాలా వరకూ మినహాయింపులను ఇచ్చారు. మూడో దశ లాక్ డౌన్ లోనే దాదాపుగా బెంగళూరులో సిటీ బస్సులు కూడా మొదలయ్యాయి! పరిమిత స్థాయిలో అయినా అక్కడ బస్సులను కదిలించారు.
ఇక నాలుగో దశ లాక్ డౌన్ లో బెంగళూరులో రెస్టారెంట్లకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతానికి టేక్ అవే మాత్రమే అంటున్నారు. ఇక గ్రీన్ జోన్లలో ఆ నిబంధనలూ లేవు. అలాగే స్థానిక టూరిస్టులకు కూడా అవకాశం ఇవ్వడానికి రెడీ అని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జిమ్ లకు పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. ఇక నెక్ట్స్ బార్లు, పబ్బులే అని కూడా తెలుస్తోంది. జూన్ ఒకటి నుంచి కర్ణాటకలో బార్లు, పబ్బులు తెరుచుకోవచ్చని టాక్.
అవేమో కానీ.. ఆలయాలకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి దేవాలయాలను తెరవొచ్చని, భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కలిగించవచ్చు అని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా లాక్ డౌన్ తర్వాత తొలి సారిగా ఆలయాలను ఓపెన్ చేయిస్తున్న రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తూ ఉంది. ఇప్పుడిప్పుడు కర్ణాటకలో కేసుల సంఖ్య దినవారీగా పెరుగుతూ ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం మినహాయింపుల విషయంలో ముందుంది.