లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించారని తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై మరిన్ని ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఇప్పటికే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తాజాగా లాయర్లు కూడా చంద్రబాబు నాయుడు తీరుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఏదో యుద్ధం గెలిచి వచ్చిన వ్యక్తి వలే ఏపీలోకి చంద్రబాబు నాయుడు ఎంటరయిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పాటించాల్సిన నియమాలన్నింటినీ తుంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ఏదో విజయయాత్ర చేయించుకున్నారు. తన అనుచరగణంతో చంద్రబాబు నాయుడు ర్యాలీ తరహాలో వెళ్లారు.
అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు లాక్ డౌన్ వేళ ప్రజలకు సాయంగా నిలవడానికి వెళితేనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వారు లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించారని ఏకంగా కోర్టులో పిటిషన్లు, ఆఖరికి సీబీఐ విచారణల వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే చంద్రబాబు నాయుడు వెళ్లింది కనీసం ఏ పరామర్శకో, సహాయం చేయడానికో కూడా కాదు.
రెండు నెలలుగా తెలంగాణ లోని తన నివాసానికి పరిమితం అయిపోయి, ఏపీలోకి రావడానికి కూడా సంశయించి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు అలా బయటకు కదిలారు. ఆయన సాధించింది ఏమీ లేకపోయినా.. ఆయన అనుచరులు భారీ హంగామా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు సాగించిన దోమలపై దండయాత్ర ప్రోగ్రామ్ ను గుర్తు చేసింది ఈ వ్యవహారం. ఇలాంటి సమయంలో అలాంటి విజయయాత్రలకు అవకాశం లేకపోయినా, జయము జయము చంద్రన్న గీతాలపన ఒక రేంజ్ లో జరిగింది. ఇలాంటి నేపథ్యంలో లాయర్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు నియమాలను అతిక్రమించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఈ పిటిషన్లపై కోర్టు ఎలా స్పందిస్తుందో!