వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీ సీటు ఇచ్చి, గెలిపించి అత్యున్నత చట్ట సభకు రఘురామను వైసీపీ పంపినందుకు, ఆ పార్టీ రుణాన్ని రఘురామ మరోరూపంలో తీర్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ప్రభుత్వం అధికారంలో కొనసాగడమే నేరమన్న రీతిలో రఘురామ ప్రతి దానికి కోర్టును ఆశ్రయించడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో రుషికొండలో నిర్మాణాలకు సంబంధించి ఆయనకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడం గమనార్హం. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వడం విశేషం.
విశాఖలో రుషి కొండపై టూరిజం భవనాల నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకునేందుకు రఘురామ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తన అభ్యంతరాలను తెలియజేస్తూ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ స్టే విధించింది. తన వాదనలు వినకుండానే ఎన్జీటీ స్టే విధించడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
విచారణలో భాగంగా ఎన్జీటీ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం రఘురామ లేఖ ఆధారంగానే ప్రాజెక్టుపై స్టే ఇవ్వడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లగా పరిగణించాలంటూ తేల్చి చెప్పింది. బుధవారం మరోసారి విచారించింది.
ముందుగా చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేసింది. దీనిపై విచారణను హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తేల్చే వరకూ ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది.
ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేసింది. ఇదే సందర్భంలో పర్యావరణాన్ని కాపాడాల్నిస అవసరం ఉంది కాబట్టి హైకోర్టులో విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. రఘురామ కోరుకున్నట్టుగా రుషికొండపై నిర్మాణాలను అడ్డుకోలేకపోయారు.