కాజల్, ప్రణీత, అలియాభట్, కత్రినా, నిక్కీ గల్రానీ.. ఇలా చాలామంది హీరోయిన్లు ఈమధ్య పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. టాలీవుడ్ నటి పూర్ణ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని తను స్వయంగా ప్రకటించింది.
దుబాయ్ కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ షనిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు తమ ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని పూర్ణ స్వయంగా వెల్లడించింది. త్వరలోనే జీవితంలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోందని ప్రకటించింది. పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిమ్.
చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది పూర్ణ. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గలేదు. రీసెంట్ గా అఖండ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అలా ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు బుల్లితెరపై కూడా జడ్జిగా, డాన్స్ పెర్ఫార్మర్ గా బిజీ అయింది. ఇలా 2 చేతులా సంపాదిస్తోంది పూర్ణ.
చాన్నాళ్లుగా పూర్ణ కోసం వాళ్ల ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట పూర్ణకు చేదు అనుభవం కూడా ఎదురైంది. పెళ్లికొడుకు బంధువులమంటూ కొందరు పూర్ణ ఇంట్లోకి ప్రవేశించారు. బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. మరోవైపు ఆమె ఆల్రెడీ రిలేషన్ షిప్ లో ఉందంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
మొత్తమ్మీద అన్నింటికీ చెక్ పెడుతూ.. పూర్ణ తన పెళ్లి మేటర్ బయటపెట్టింది. కుటుంబం ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని తెలిపిన పూర్ణ.. తనది పెద్దలు కుదిర్చిన వివాహమా లేక ప్రేమ పెళ్లా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.