కోనసీమ విధ్వంసంలో ఆ రెండు పార్టీల పాత్ర‌

కోన‌సీమ విధ్వంస‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ పాత్ర ఉంద‌ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై బీజేపీ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. …

కోన‌సీమ విధ్వంస‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ పాత్ర ఉంద‌ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌పై బీజేపీ వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. 

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో తాము పోటీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి అంటే త‌మ‌కు గౌర‌వం, అభిమానం ఉన్న‌ట్టు పేర్కొన్నారు. టీడీపీ ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తోంద‌ని విమ‌ర్శించారు.

ఇటీవ‌ల కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డం వివాదానికి దారి తీయ‌డంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం ఓట్ల రాజ‌కీయాల్లో భాగంగానే కోన‌సీమ‌లో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. వీటి వెనుక టీడీపీ, వైసీపీ ఉన్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు. 

ఈ నెల 7న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో గోదావ‌రి గ‌ర్జ‌న పేరుతో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్టు వీర్రాజు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌ర‌వుతార‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌మ చ‌లువే అన్నారు. న‌వ‌ర‌త్నాలతో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల కంటే మోదీ ఇచ్చే సంక్షేమ‌మే ఎక్కువ‌న్నారు. ఏపీకి కేంద్రం 20 లక్షల ఇళ్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవ‌లం 40 వేల ఇళ్లు మాత్ర‌మే క‌ట్టింద‌ని విమ‌ర్శించారు.