వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ నేతలు పదేపదే విమర్శిస్తుంటారు. బాస్‌లు ఒకటంటే, ఎల్లో మీడియా పది మాటల్న కలిపి హైలెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, ఎదురే లేకుండా దూసుకుపోతుందని చంద్రబాబు నినాదాన్ని అందుకున్నారు.
క్విట్ జగన్, సేవ్ ఏపీ అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపునకు జనం బ్రహ్మరథం పడుతూ, గడప గడపకూ వెళుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని టీడీపీ నేతలు ఊదరగొడుతున్నారు.
గెలుపుపై అంత భరోసా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరి నుంచి టీడీపీ ఎందుకు తప్పుకున్నట్టు? పోటీ చేయొద్దని అధికార పార్టీ నుంచి లేదా ప్రభుత్వం నుంచి టీడీపీకి ఏమైనా అప్పీల్ వచ్చిందా? అలాంటిదేమీ లేదు. అలాంటప్పుడు ఎవరూ కోరకుండానే బరి నుంచి తప్పుకోడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇంతకూ ఎన్నికలంటే భయమెవరికి? …ఈ ప్రశ్నకు టీడీపీ సమాధానం చెప్పాల్సి వుంది. వార్ వన్‌సైడే అనే మాటల కంటే ఫలితమే ఎక్కువ భరోసా ఇస్తుంది కదా? మరి ఆత్మకూరులో పోటీ చేసేందుకు టీడీపీ ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్న ఎదురవుతోంది.
వైసీపీ పని అయిపోయిందని చంద్రబాబు, లోకేశ్ నమ్ముతున్నప్పుడు పోటీ మాట ఎత్తితే… వెనక్కి తిరగచూడకుండా ఎందుకు పరుగు పెడుతున్నారనే నిలదీతలు ప్రత్యర్థి పార్టీ నుంచి వస్తున్నాయి. తండ్రీతనయులిద్దరూ ఉత్తరకుమారునికి మించి పోయారనే సెటైర్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి.