న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో మొట్ట మొదటి సారిగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ స్ఫూర్తితో వైసీపీ ముందడుగు వేసింది. దీనికి తాజా నిదర్శనం హైకోర్టుకు వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వేర్వేరుగా లేఖలు రాయడమే. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతి చేరుకున్న చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ అడుగడుగునా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని, అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ ఆ లేఖల్లో ప్రస్తావించారు.
ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి చంద్రబాబు, ఆయన తనయుడిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టును వెన్నపూస గోపాల్‌రెడ్డి అభ్యర్థించారు. అంతేకాదు, ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, దళిత నాయకుడు మేరుగ నాగార్జున కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. చంద్రబాబు తనకిచ్చిన అనుమతిని దుర్వినియోగం చేసి , తన పర్యటనను రాజకీయ షోగా మార్చేశారని లేఖలో ప్రస్తావించారు. బాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టులో కేసు వేయడం, వెంటనే విచారణ చేపట్టడం తెలిసిందే. విచారణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ కేసును సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన విషయాలు తెలిసినవే.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు రెండు నెలల తర్వాత మందీమార్బలంతో అమరావతికి వచ్చారు. సహజంగా కోర్టులో కేసులు వేయడం వైసీపీకి అలవాటు లేదు. అంతెందుకు గత టీడీపీ హయాంలో బస్సులు, అన్నా క్యాంటీన్లు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగు వేసింది. ఏనాడూ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దాఖలాలు లేవు. కానీ జగన్ సర్కార్‌పై ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక సాకుతో కోర్టును ఆశ్రయించడం మామూలైంది.
ప్రత్యర్థి పార్టీ నుంచి స్ఫూర్తి పొందిన వైసీపీ కూడా అదే బాట పట్టింది. తాజాగా అమరావతికి వచ్చిన బాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇందులో భాగంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలనే కోవిడ్ నిబంధనలను చంద్రబాబు ఏ మాత్రం పాటించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హైకోర్టుకు లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ లేఖలపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం ఏ విధంగా స్పందిస్తుందోనని అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.