జీవితంలో ఎన్నడూ లేని విధంగా బాధ అనుభవిస్తున్నట్టు ఓ నటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఇంకా ఎందుకు బతికి ఉన్నానా? అని ఆమె ప్రశ్నిస్తున్నదంటే… ఎంతగా కలత చెందుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ కోలీవుడ్ నటి యాషికా ఆనంద్ ఈ విధమైన ఆవేదన చెందుతోంది.
ఈ ప్రమాదంలో ఆమె ప్రాణస్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చెన్నైలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న యాషికా ఓ ఎమోషనల్ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె ఏమన్నారంటే….
''నా జీవితంలో ఎన్నడూలేని విధంగా బాధ అనుభవిస్తున్నాను. అది మాటల్లో చెప్పలేను. నేనింకా బతికే ఉన్నందుకు మానసికంగా హింస అనుభవిస్తున్నాను. కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేక నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినందుకు నిందించాలో అర్థం కావడం లేదు. పావనీ.. మా నుంచి శాశ్వతంగా దూరమయ్యావు. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నా. నీవు నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు. కానీ, నీ కుటుంబాన్ని బాధాకరమైన స్థితిలోకి నెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వు మళ్ళీ మా మధ్యకు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అంటూ యాషికా పేర్కొంది.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవిత కాలం వెంటాడే చేదు జ్ఞాపకాన్ని ప్రమాద రూపంలో యాషికా మిగుల్చుకున్నారనే విషయం ఆమె పోస్టు ద్వారా అర్థమవుతోందనే కామెంట్స్ వస్తున్నాయి. శరీరానికైన గాయాలు మానుతాయి కానీ, మనసుకు అయిన గాయాలు ఎప్పటికీ మానవని యాషికా ఉదంతమే నిదర్శనం అని చెప్పక తప్పదు.