నాయకులు మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు అయితే ఆచీ తూచీ మాట్లాడాలి. విశాఖకు చెందిన సౌత్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాజాగా ఆవేశంతో చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
ఆయన ఏడాది క్రితం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగానే హవా చలాయిస్తున్నారు. అయితే ఆయన తాజాగా ఉన్నత అధికారుల విషయంలో చేస్తున్న కామెంట్స్ మాత్రం వైసీపీ సర్కార్ కే ఇరకాటంగా మారుతున్నాయి.
విశాఖలో ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతున్నారు జీవీఎంసీ కమిషనర్ జి సృజన. ఆమె ముక్కు సూటి ఐఏఎస్ అధికారిణి. ఆమె నిబంధనల ప్రకారమే నడచుకుంటారని పేరు. ఇక జగన్ సైతం ఆమెను ఏరి కోరి జీవీఎంసీకి కమిషనర్ గా నియమించారు.
ఆమె విశాఖ సౌత్ లో పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉంటే వాటికి ఖాళీ చేయించారు. జీవీఎంసీ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆక్రమణలదారులకు మద్దతుగా ఎమ్మెల్యే వాసుపల్లి సీన్ లోకి రావడమే ఇక్కడ విశేషం. ఆయన ఏకంగా కమిషనర్ తోనే వాగ్వాదానికి దిగిపోయారు. అంతే కాదు ఆమెని సస్పెండ్ చేయిస్తామని కూడా హాట్ కామెంట్స్ చేశారు.
ఆమెకు ఏపీలో ఎక్కడా పోస్టింగులు రాకుండా కూడా తాను చూస్తానని కూడా దూకుడు చేశారు. దీని మీద సోషల్ మీడియాల అయితే వాసుపల్లి కామెంట్స్ ని నెటిజన్లు పెద్ద ఎత్తున ఏకి పారేస్తున్నారు.
ఒక ఐఏఎస్ అధికారిణి విషయంలో ఇలా మాట్లాడడం ఏంటి అంటున్నారు. పోస్టింగు రాకుండా చేయడానికి ఆయన అంత పవర్ ఫుల్లా అని కూడా సెటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి ఈ ఎమ్మెల్యే దురుసు వైఖరిపైన అధికార పార్టీలోనూ వేడిగానే చర్చ సాగుతోందిట.