అంతా మాయ: జగన్ చేతులు కట్టేసిన చంద్రబాబు

ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అలా చకచకా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు జగన్. కీలకమైన ఎన్నో అంశాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు స్పష్టంచేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు పోలవరం వంటి ప్రాజెక్టులపై…

ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే అలా చకచకా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు జగన్. కీలకమైన ఎన్నో అంశాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్టు స్పష్టంచేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు పోలవరం వంటి ప్రాజెక్టులపై నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. మరోవైపు ప్రజాసంక్షేమం, పాలన, అవినీతిని రూపుమాపడం లాంటి అంశాల్లో కూడా దూకుడు చూపిస్తున్నారు. ఇన్ని చేస్తున్న జగన్, అమరావతి విషయంలో మాత్రం ఇప్పటివరకు తన వైఖరిని స్పష్టంచేయలేకపోయారు. దీనికి కారణం చంద్రబాబు.

అమరావతి అనేది అతిపెద్ద స్కామ్. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. కానీ ఇదే వ్యవహారాన్ని చట్టాల చట్రంలో ఇరికించి, అంతా లీగల్ గా పూర్తిచేశారు చంద్రబాబు. దీనికితోడు ఈ మొత్తం ప్రహసనంలో రైతుల్ని కూడా ఇరుకునపెట్టారు. ఇలా ఎక్కడికక్కడ చిక్కుముడులు బిగించడంతో అమరావతిపై వెంటనే ఓ నిర్ణయం తీసుకోవడం జగన్ కు కష్టంగా మారుతోంది. ఇప్పటికిప్పుడు అమరావతిని అభివృద్ధి చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది.

మరోవైపు అమరావతి కంటే కీలకమైన పథకాలు, కార్యక్రమాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి టైమ్ లో అమరావతి కింద వేల కోట్ల ఖర్చుపెట్టడం వైసీపీ సర్కార్ కు ఇష్టం లేదు. ఎఁదుకంటే ప్రజలకు నేరుగా సంబంధం లేని కార్యక్రమం ఇది. అమరావతి లేకున్నా పాలన జరుగుతుంది, ప్రజల జీవనవిధానం, వాళ్లకు అందుకున్న సౌకర్యాల్లో మార్పురాదు. జగన్ ఆలోచించేది ఈ కోణంలోనే. అందుకే అమరావతిపై ఆయన దృష్టిసారించడం లేదు.

పోనీ.. చంద్రబాబు చేసిన పనుల్ని ఎక్కడికక్కడ నిలిపేద్దామంటే ఆ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారు. భూసమీకరణ పేరిట ఏకంగా 34 వేల ఎకరాలు లాక్కున్నారు చంద్రబాబు. రియల్ ఎస్టేట్, రాజధాని అంటూ వాటిని చదునుచేసి వదిలేశారు. అక్కడక్కడ చిన్న చిన్న నిర్మాణాలు కూడా ప్రారంభమవ్వడంతో, రైతుల భూముల్ని తిరిగి వెనక్కి ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి. ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కృత్రిమ రియల్ ఎస్టేట్ బూమ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భూముల్ని వెనక్కి ఇచ్చి సాగును ప్రోత్సహించినా అది గిట్టుబాటు కాదు. రైతులు తిరిగి రియల్ ఎస్టేట్ వైపే మొగ్గుచూపుతారు. జగన్ ను ఆలోచనలో పడేసిన అంశాల్లో ఇది కూడా ఒకటి.

ఇప్పుడు మనం చెప్పుకున్నవి కేవలం కొన్ని అంశాలు మాత్రమే. ఇలాంటి ఎన్నో సామాజిక, ఆర్థిక అంశాలతో రాజధాని అంశం ముడిపడి ఉంది. అందుకే జగన్ దీనిపై ఉన్నఫలంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే సమగ్ర దర్యాప్తునకు కమిటీ వేశారు. రైతులు నష్టపోకుండా, ప్రభుత్వానికి భారం కాకుండా మధ్యేమార్గంలో రాజధానిపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి డబ్బులు రావు. రాష్ట్రం నిధులు కేటాయించే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ అమరావతిపై యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉంది.

అయితే టీడీపీ, బాబు అనుకూల మీడియా మాత్రం వాస్తవ పరిస్థితిని గమనించకుండా వైసీపీ సర్కార్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. అమరావతిని వీడి మరో ప్రత్యామ్నాయం వైపు జగన్ ఆలోచిస్తున్నారంటూ కథనాలు వండివారుస్తోంది. అమరావతికే కట్టుబడి ఉన్నామని ఓవైపు వైసీపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, టీడీపీ మాత్రం తన విషప్రచారాన్ని ఆపడం లేదు. వేలాది రైతుల పొట్టకొట్టేలా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది.

రాజధాని విషయంలో టీడీపీ విషప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే జగన్ దీనిపై తక్షణం స్పందించాల్సిందే. ఇప్పటికే వేసిన కమిటీ ఇచ్చే నివేదిక వరకు ఆగకుండా.. తమ పార్టీ అభిప్రాయమేంటో జగన్ చెప్పాలి. రాజధాని విషయంలో ఎందుకు అపోహలు వస్తున్నాయో, ఎక్కడ జాప్యం జరుగుతుందో వెల్లడించాలి. మరీ ముఖ్యంగా రాజధాని చుట్టూ చంద్రబాబు ఏం చేశారో, ఇప్పటి ప్రభుత్వాన్ని ఎలా ఇరుకునపెట్టారో వివరించాలి. అప్పుడే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గుతుంది. జగన్ ఈ పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. 

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది