'అర్జున్ రెడ్డి' సినిమా విడుదల అయ్యి త్వరలోనే రెండు సంవత్సరాలు కాబోతున్నాయి. రెండేళ్ల కిందట ఆగస్ట్‌లో విడుదల అయ్యింది ఆ సినిమా. ఈ రెండేళ్లలోనూ ఎక్కడో, ఏదో ఒక విధంగా ఆ సినిమా వార్తల్లోనే ఉండటం గమనార్హం! విడుదలకు ముందు నుంచినే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆ సినిమా విడుదల తర్వాత మరింత సంచలనం రేపింది. అప్పటివరకూ తెలుగులో అలాంటి సినిమాలు వస్తాయని, రాగలవని ఆశించిన వాళ్లు కొందరు అయితే, అలాంటి సినిమా రావడంతో ఆశ్చర్యపోయినవారు మరి కొంతమంది!
కొందరు ఆ సినిమాను విమర్శించారు, మరికొందరు ప్రశంసించారు. లవ్ హిమ్, హేట్ హిమ్.. యూ కాంట్ ఇగ్నోర్ హిమ్ అన్నట్టుగా నిలిచాడు 'అర్జున్‌రెడ్డి'. ఆ సినిమాను ప్రశంసించిన వాళ్లు, విమర్శించిన వాళ్లు పెద్ద పరిశోధనలు చేసినంత పనిచేశారు. సోషల్ మీడియాలో ఆ సినిమాను విమర్శించిన వాళ్లు ఘాటుగా విమర్శనాత్మక విశ్లేషణలు పోస్ట్ చేస్తే, ఆ సినిమాను ఇష్టపడినవాళ్లు అంతే ధీటుగా స్పందించడం గమనార్హం!
అర్జున్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో జరిగిన చర్చ చాలు ఆ సినిమా ఎంత కల్ట్ హిట్టో చెప్పడానికి. ఆ సినిమాపై అత్యంత ఆశ్చర్యం కలిగించే కామెంట్లు కూడా కొన్ని సోషల్ మీడియాలో కనిపిస్తాయి ఇప్పటికీ. ఒక ఉత్తరాది వ్యక్తి ఆ సినిమాకు సంబంధించిన ఒక యూట్యూబ్ వీడియో కిందపెట్టిన కామెంట్ అలాంటి వాటిల్లో ఒకటి. ఆ సినిమా చూసిన తర్వాత తన కొడుక్కు 'అర్జున్ రెడ్డి' అని పేరు పెట్టినట్టుగా అతడు కామెంట్ చేశాడు! ఆ తరహా కామెంట్లు మరిన్ని కూడా అక్కడ కనిపిస్తాయి!
ఒక సినిమా కల్ట్ హిట్ అని అనడానికి ఇలాంటి ఉదాహరణలే చెప్పాలి. ఆల్రెడీ పాపులర్ అయిన వారితో, అభిమానగణాన్ని కలిగి ఉన్న వాళ్లతో తీసిన సినిమాలు కల్ట్ హిట్ అయితే ఆ ఇంపాక్ట్ వేరు. రాత్రికి రాత్రి కొంతమందిని స్టార్లుగా చేసే సినిమాలు వేరు. అలాంటి సినిమాలు తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చింది తక్కువే. 'అరుంధతి' 'అర్జున్ రెడ్డి' వంటి సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అరుంధతి అనుష్కను స్టార్‌ను చేస్తే, అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండను స్టార్‌ను చేసింది. అర్జున్ రెడ్డి గురించినే మాట్లాడుకుంటే.. ఈ సినిమా తెలుగు భాషలో ఎంత సంచలనాన్ని రేపిందో ఇతర భాషల వారిలోనూ అదేస్థాయి ఆసక్తిని రేకెత్తించిన వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఇటీవలే హిందీలో 'కబీర్ సింగ్'గా రూపొంది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ 'అర్జున్ రెడ్డి' వసూళ్లు 356 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఒక సినిమా 350 కోట్ల రూపాయలకు పైస్థాయి వసూళ్లను సాధించడం బాలీవుడ్‌నే ఆశ్చర్యపరిచింది. సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్ సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో అలాంటి వసూళ్లను సాధించడం సాధ్యం కావడంలేదు. అలాంటిది 'అర్జున్ రెడ్డి' అలాంటి విజయాన్ని నమోదు చేశాడు.
సాధారణంగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ చేస్తే బోల్తా కొట్టే సందర్భాలే చాలా చాలా ఎక్కువ. అలాంటి సినిమాలు మనమెన్నో చూశాం, చూస్తున్నాం. తెలుగులో ఇది వరకటి సూపర్ హిట్‌లు కొన్నిఇతర భాషల్లో రీమేక్ అయ్యి అట్టర్‌ఫ్లాప్ అనిపించుకున్నాయి. వర్షం, ఒక్కడు… వంటి సినిమాలు కూడా వేరే భాషల్లో ఫ్లాప్ అయ్యాయి. ఎక్కడో సూపర్ హిట్ అయ్యాయని మనోళ్లు రీమేక్ చేసిన 'వాన', 'యూటర్న్', 'కిరాక్ పార్టీ' వంటి సినిమాలు ఏమయ్యాయో తెలుగు వారికి తెలిసిన సంగతే.
వేరే భాషలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమాలు రీమేక్ అయ్యి అలాంటి విజయాన్ని నమోదు చేయడం అత్యంత అరుదైన అంశం. అయితే 'అర్జున్ రెడ్డి' మాత్రం తెలుగుకు మించిన స్థాయిలో హిందీలో హిట్ అయ్యాడు. తెలుగులో ఐదు కోట్ల బడ్జెట్‌లో రూపొందించిన సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. హిందీలో మూడు వందల యాభై కోట్ల రూపాయలను దాటింది! సక్సెస్‌కు ఇంతకు మించిన నిర్వచనం ఏముంటుంది.
తెలుగు వెర్షన్‌తో పోలిస్తే ఏమాత్రం మార్పులు లేకుండా రూపొందించిన హిందీ వెర్షన్ అక్కడ కూడా బోలెడంత చర్చకు కారణం అయ్యింది. ఆ సినిమాపై ఫెమినిస్టులు ఫైర్ అయ్యారు, దర్శకుడు సందీప్ రెడ్డి కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. అలా అక్కడ కూడా చర్చనీయాంశంగా నిలిచింది 'అర్జున్ రెడ్డి'. ఇక అర్జున్ రెడ్డి తమిళంలో షూటింగ్ పూర్తి చేసుకుందట. ఈ సినిమా అక్కడ రెండోసారి రూపొందుతున్నట్టే. ముందుగా బాల దర్శకత్వంలో ఆ సినిమా దాదాపు రెడీ అయ్యింది. అయితే బాల ఆ సినిమాకు చేసిన మార్పులు నిర్మాత అయిన విక్రమ్‌కు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది.
అలాగే బాల కట్ చేసిన టీజర్, ట్రైలర్ కూడా నవ్వుల పాలైంది. దీంతో మొత్తానికే తేడా కొట్టేస్తుందని విక్రమ్‌కు అర్థమైంది. అందులోనూ తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ ఆ సినిమాను రూపొందిస్తున్నాడు విక్రమ్. మళ్లీ రీషూట్ చేయించాడు. సినిమా మొత్తాన్నీ మళ్లీ తీయించాడు. తెలుగు వెర్షన్‌కు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌తో తమిళ వెర్షన్‌ను రూపొందించాడు విక్రమ్. ఈసారి కార్బన్ కాపీ చేశారని స్పష్టం అవుతోంది. అర్జున్ రెడ్డి విజయానికి సక్సెస్ ఫార్ములా కార్బన్ కాపీనే అవుతుందేమో.
తమిళ వెర్షన్ రిపేర్లు జరుగుతుండగానే హిందీ వెర్షన్ వచ్చి విజయాన్ని సాధించింది. అలా విక్రమ్ తనయుడి సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమా అని తమిళంలో ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక తమకు అర్జున్ రెడ్డి రీమేక్ – డబ్బింగ్ అవసరం లేదంటున్నారు మలయాళీలు. తాము తెలుగు అర్జున్ రెడ్డినే తనివితీరా చూసినట్టుగా కొంతమంది మలయాళీ నెటిజన్లు పేర్కొన్నారు.
మలయాళ ఇండస్ట్రీపై అత్యంత ప్రభావం చూపిన తెలుగు సినిమాగా వారు 'అర్జున్ రెడ్డి'ని పేర్కొంటున్నారు. తాము రా అండ్ రియాలిస్టిక్ సినిమాలను బాగా ఇష్టపడే విషయం అందరికీ తెలుసని, అర్జున్ రెడ్డిలో అలాంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని మలయాళీలు చెబుతారు. థియేటర్లలో విడుదల అయినప్పుడు, అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చాకా అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్‌నే బాగా చూశారట మలయాళీలు. ఇక ప్రత్యేకంగా రీమేక్, డబ్బింగ్ చేయాల్సిన అవసరం లేనివారు అంటున్నారు.
ఇక కన్నడీగుల పరిస్థితీ అదే. కన్నడీగుల్లో సినిమా ప్రియులు ఇప్పటికే 'అర్జున్ రెడ్డి'పై ఒక లుక్ వేశారు. ఆ సినిమాను అమితంగా ఆదరించారు. అయితే కన్నడలో ఇంకా రీమేక్ ప్రతిపాదన ఉంది. కాస్త లేట్‌గా అయినా అక్కడ ఎవరో ఒకరు ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశాలున్నాయి. ఇలా 'అర్జున్ రెడ్డి' పరంపర మరి కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా తమిళ వెర్షన్ విడుదల కానుంది. ఇలా అర్జున్ రెడ్డి లెగసీ కొనసాగనుంది!
-జీవన్‌రెడ్డి.బి