టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి రాజకీయ చరమాంకంలో పెద్ద కష్టమే వచ్చింది. సాధారణంగా మైండ్‌గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట అని నిన్నమొన్నటి వరకు ప్రత్యర్థులు కూడా ఒప్పుకునేవాళ్లు. అయితే జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయాలు ఔట్‌డేటెడ్ అయిపోయాయనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. గతంలో చంద్రబాబును ఓడించడం కష్టమనే వాళ్లు.
ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్, అలాగే ఓటర్లను మాయ చేయడంలో చంద్రబాబు వ్యూహాలను ప్రత్యర్థులు అందుకోలేరనే అభిప్రాయాలుండేవి. అయితే 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి దెబ్బకు చంద్రబాబు ముసుగుతన్ని ఇంట్లో పడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అలిపిరిలో తనపై హత్యాయత్నాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారు. దీన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరి వ్యూహాలు వారివి.
జనం కోసం 24 గంటలూ శ్రమిస్తున్న తనను నక్సలైట్లు అంతమొందించాలని మందుపాతర్లు పెట్టారని, ప్రజలకు సేవ చేయడానికే ఆ కలియుగ దైవం ప్రాణాలు కాపాడారని, మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సరికొత్త వేషంలో చంద్రబాబు తొమ్మిది నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికలకు ముందు వైఎస్సార్ చావోరేవో అంటూ పాదయాత్ర కూడా చేసి వున్నారు. అయితే చంద్రబాబుపై సానుభూతి పని చేస్తుందా? వైఎస్సార్‌కు పాదయాత్ర కలిసి వస్తుందా? అనే చర్చ నడిచింది. చివరికి వైఎస్సార్‌నే విజయం వరించింది.
బాబు, వైఎస్సార్ రాజకీయంగా ప్రత్యర్థులు అయినప్పటికీ, వ్యక్తిగతంగా స్నేహంగా మెలిగేవారు. అరుదుగా తప్ప అసెంబ్లీలో పరుషంగా మాట్లాడుకునేవారు కాదు. ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటూ అసెంబ్లీ సమావేశాల్ని రక్తి కట్టించేవారు. వైఎస్సార్ ఆకస్మిక మృతితో ఆయన తనయుడు వైఎస్ జగన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టుకున్నారు.
చంద్రబాబును మించిపోయేలా జగన్ రాజకీయ ఎత్తుగడలు వేయడం ప్రారంభించారు. దూకుడు, అనుకున్నదే చేసుకుపోవడం జగన్ రాజకీయ లక్షణాలు. త్రుటిలో అధికారాన్ని చేజార్చుకున్న జగన్‌ను అసెంబ్లీలో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అధికార టీడీపీ మొదటి రోజు నుంచే మైండ్‌గేమ్‌కు తెరలేపింది. దూకుడుగా, మొండిగా వ్యవహరిస్తే తప్ప తనను రాజకీయంగా బతకనివ్వరనే ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.
జగన్ అసెంబ్లీకి వెళ్లిన మొదటి రోజుల్లో టీడీపీ బెంబేలెత్తించడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా నాటి మంత్రి యనమల రామకృష్ణుడు తన అతి తెలివి తేటల్ని జగన్‌పై ప్రయోగించసాగారు. ఓ దశలో ఈ బఫూన్లకు సమాధానం చెప్పాలా? అని తీవ్ర పదజాలంతో టీడీపీ సభ్యుల్ని నిండు అసెంబ్లీలో జగన్ దూషించారు. దీంతో సభంతా గందరగోళం. క్షమాపణ చెప్పాలని స్పీకర్ స్థానంలో వున్న కోడెల శివప్రసాద్ పదేపదే జగన్‌కు సూచించారు.
క్షమాపణ చెప్పకపోగా మరోసారి అదే మాటను మరింత బలంగా జగన్ చెప్పడం విశేషం. టీడీపీని, ఎల్లో మీడియాని ఎలా ఎదుర్కోవాలో వారి ఆగడాలే జగన్‌కు పాఠాలు నేర్పించాయి. టీడీపీ ఐదేళ్ల పాలనలో జగన్ నాయకుడిగా రాటుదేలారు. టీడీపీ, ఎల్లో మీడియా వ్యూహాలను పసిగట్టారు. వాటికి విరుగుడుగా ఏం చేయాలో జగన్ బాగా నేర్చుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారితో జగన్ ఆటాడం మొదలు పెట్టారు. మొండిగా వ్యవహరిస్తున్న జగన్ స్వభావంతో పచ్చబ్యాచ్‌కు దిక్కుతోచడం లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీని జగన్ చావు దెబ్బతీశారు. దీంతో వివిధ దఫాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలనే టీడీపీ బహిష్కరిస్తున్నామని చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో సైతం టీడీపీని వైసీపీ మట్టి కరిపించింది. ఇదే జగన్‌కు కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది.
కుప్పంలో మనమెందుకు చంద్రబాబును ఓడించలేమనే నినాదాన్ని జగన్ బలంగా వినిపిస్తున్నారు. బాబును ఓడించడం అసాధ్యం ఎందుకు అవుతుందనే ప్రశ్నతో చంద్రబాబు, టీడీపీ నేతలతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. దీంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది. అసలే జగన్ అంత మంచివాడు కాదు. తాను అనుకున్నది చేయడానికి ఎందాకైనా వెళ్తారని చంద్రబాబుకు బాగా తెలుసు. రాష్ట్రం కథ దేవుడెరుగు… పవన్‌కల్యాణ్‌ను రెండుచోట్ల మట్టి కరిపించినట్టుగా, కుప్పంలో తనకూ అలాంటి గతే పట్టిస్తారేమో అనే భయం చంద్రబాబుకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చుతోంది.
జగన్ ఆశయానికి తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డి తోడయ్యారు. దేనిలోనూ వెనుకంజ వేసే స్వభావం కాదు. బాబును ఓడించడానికి కుప్పంలో దేనికైనా రెడీ అనే లెవెల్లో వైసీపీ గట్టి పట్టుదలతో ముందుకెళుతోంది. కుప్పంలో చంద్రబాబునే అడుగు పెట్టనివ్వమని వైసీపీ ఊరికే మాట వరుసకు అనడం లేదు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు.
కుప్పంలో రెండుమూడు రోజులకు ఒకసారి 200 మంది చొప్పున టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారు. ఇది ఇట్లే కొనసాగితే చంద్రబాబు పరిస్థితి ఏంటి? అని టీడీపీ భయాందోళనలో వుంది. కేవలం పార్టీ సానుభూతిపరులు, అభిమానులు ఉంటే సరిపోతుంది. వారిని పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్లి, ఓట్లు వేయించగలిగే నాయకులు టీడీపీకి కావాలి. ఇది కరువవుతోంది. మరోవైపు వైసీపీకి ఈ విషయంలో భరోసా పెరుగుతోంది. వైసీపీలో అంతర్గత కలహాలను సరిదిద్దుకుంటే మాత్రం చంద్రబాబుకు సినిమానే.
ప్రస్తుతం కుప్పం కేంద్రంగా మైండ్‌గేమ్‌లో వైసీపీ పైచేయి సాధించింది. కుప్పంలో చంద్రబాబు పునాదులు కదులుతున్నాయనే సంకేతాల్ని పంపడంలో వైసీపీ విజయం సాధించింది. ఇదే టీడీపీని మానసికంగా బలహీనపరుస్తోంది. ఒకప్పుడు నామినేషన్‌కు, ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు కుప్పం వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. రెండుమూడు నెలలకోసారి కుప్పానికి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వెళ్లకపోతే… ఏమవుతుందో అనే భయం ఆయన్ని వెంటాడుతోంది.
స్థానిక సంస్థల్లో ఘోర పరాజయంతో చంద్రబాబు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. ఇది ఆయనకు ప్రతికూలంగా మారింది. నిజంగా చంద్రబాబును అభిమానించే వాళ్లు కూడా ఆయనకు దూరమవుతున్నారు. అలాంటి వాళ్లే చంద్రబాబుకు రానున్న రోజుల్లో కష్టమబ్బా అని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పానికి వెళ్లడం అక్కడి రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది.
చంద్రబాబుపై జగన్ కుప్పం బౌన్సర్ విసురుతున్నారు. దాన్ని ఎదుర్కోవడం చంద్రబాబుకు సవాల్‌గా మారింది. మొత్తానికి చంద్రబాబుకు కుప్పం దడ పట్టుకుందన్నది వాస్తవం.