డేటా చోరీపై చంద్రబాబు, లోకేశ్ తదితరులపై ప్రభుత్వం కేసులు పెడుతుందా? అలాగే వాటిపై స్టే తెచ్చుకోకపోతే జైలుకెళ్లడం ఖాయమా? అంటే …మంత్రి ఆర్కే రోజా అవుననే సమాధానం చెబుతున్నారు. టీడీపీ పాలనలో డేటా చోరీ జరిగిందని సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఇవాళ అసెంబ్లీకి నివేదిక సమర్పించారు. ఇది మధ్యంతర నివేదికే అని, లోతుగా విచారణ జరగాల్సి వుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయమై మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌లపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వెలుపుల ప్రతిరోజూ రోజా ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న జనసేనాని పవన్‌పై ఓ రేంజ్‌లో పంచ్‌లు విసిరారు. ఇవాళ చంద్రబాబు, లోకేశ్ వంతు వచ్చింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ డేటా చోరీపై హౌజింగ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికతో టీడీపీ నేతల గుండెలు జారిపోయాయన్నారు. ప్రజాసాధికారత సర్వే పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని సేవా మిత్ర యాప్ ద్వారా నాయకులకు అందించిందన్నారు. తద్వారా దుష్టరాజకీయానికి టీడీపీ తెర తీసిందని మండిపడ్డారు.
హౌజ్ కమిటీ నివేదికపై స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. ఈ డేటా దొంగ.. డేరాబాబా కన్నా డేంజర్ అని సినిమా డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్రువీకరించిన విషయాన్ని రోజా గుర్తు చేశారు.
నారా లోకేశ్‌ను చూస్తే జాలేస్తోందన్నారు. లోకేశ్‌ను చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. ఒళ్లు తగ్గించుకోడానికి ఏదేదో చేశాడన్నారు. ఒళ్లుతో పాటు బుద్ధి కూడా తగ్గిపోయేందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మీద లేనిపోని అభిమానం కురిపిస్తూ అన్నాక్యాంటీన్‌ల మీద రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెట్టారయ్యా అని రోజా ప్రశ్నించారు. నిజంగా ఎన్టీఆర్‌పై ప్రేమే వుంటే, మీ నాన్న ముఖ్యమంత్రి అయిన రోజు మొదలుకుని పేదలకు అన్నం పెట్టేవారన్నారు. కానీ ఆయనకే వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కొని, ఇవాళ తామేదో అన్యా క్యాంటీన్లను అడ్డుకుంటున్నట్టు చెప్పడం సిగ్గుచేటన్నారు.