అదిగో ట్వీట్ అంటే ఇదిగో వార్త అనే రోజులు ఇవి. అందుకే ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి వేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వార్తలుగా మారిపోతోంది.
రాజకీయాలకు నేను దూరం అయ్యానేమో కానీ నాకు రాజకీయాలు దూరం కాలేదు అనే డైలాగు వాయిస్ ఫైల్ ను మెగాస్టార్ ట్విట్టర్ లో షేర్ చేసారు. దీంతో జనాలంతా ఇందులో ఏముందో అని రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెట్టారు.
నిజానికి విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ డైలాగు రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమాలోది. గాడ్ ఫాదర్ సినిమాలో రాజకీయాలే కీలకపాత్ర పోషియాయన్నది తెలిసిందే. ఆ సినిమాలోని కీలక డైలాగ్ నే ఇది అని, సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావడం కోసం మెగాస్టార్ దీనిని ఇలా లీక్ చేసారని తెలుస్తోంది. అయితే ఆ డైలాగు చిరంజీవి వ్యక్తిగతానికి దగ్గరగా వుండడంతో అది వైరల్ అయిపోయింది.
చిరంజీవి గతంలో రాజకీయాల్లో వుండడం, ఆయన సోదరుడు పవన్ రాజకీయాల్లో వుండడం, వివిధ పార్టీల నుంచి చిరంజీవికి ఆహ్వానాలు వుండడం అన్నీ కలిసి ఈ డైలాగ్ కు ఆప్ట్ గా సరిపోయాయి.దాంతో ఈ ట్వీట్ మీద వార్తలు పుట్టుకువచ్చాయి. ఈ నెల 25న గాడ్ ఫాదర్ ట్రయిలర్ విడుదలైతే క్లారిటీ వచ్చేస్తుంది.