మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా సంచలనమే. సినిమాల్లో ఆయన విజయవంతమైన నటుడిగా గుర్తింపు పొందారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఫెయిల్యూర్ లీడర్‌గా ప్రస్థానాన్ని ముగించారు. రాజకీయాలు మానుకుని ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ అయ్యారు. రాజకీయాలకు, వివాదాలకు ఆయన చాలా దూరంగా ఉంటారు.
అలాంటి చిరంజీవి తాజాగా ట్విటర్ వేదికగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరం కాలేదనేది ఆయన మాటల సారాంశం. చిరంజీవి వాయిస్‌తో ఉన్న పది సెకెండ్ల ఆడియోలో ఏముందంటే…
“నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు” అని చిరంజీవి కామెంట్స్ చేయడం దుమారం రేపుతోంది. రాజకీయాలతో అనుబంధం కొనసాగుతోందని ఆయన చెప్పడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందనే చర్చకు తెరలేచింది. ఇటీవల కొంత కాలంగా చిరంజీవిని ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ తీసుకురావాలని అనుకుంటున్న ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి ఆసక్తి చూపలేదని చెబుతూ వచ్చారు.
తాజాగా రాజకీయాలపై కామెంట్స్ చేయాల్సిన అవసరం చిరంజీవికి ఎందుకొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయితే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి డైలాగ్ అని మరికొందరు చెబుతున్నారు. ఇప్పటికే పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా జనసేన పార్టీ పెట్టుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటప్పుడు తమ్ముడికి పోటీగా మరో పార్టీలో చిరంజీవి ఎందుకు చేరుతారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఎవరిష్టమొచ్చినట్టు వారు చిరు కామెంట్స్‌పై విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తాజా చిరంజీవి ట్వీట్ మాత్రం రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.