వియ్యంకుడి బేరం పోయిందని ఈనాడు ఆక్రోశం!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో.. వారానికోసారి అధికారులందరినీ పిలిచి మీటింగులు పెట్టడం తప్ప.. వారి పని వారిని సజావుగా చేసుకోనివ్వకుండా వెంటపడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ఎంత డ్రామా సృష్టించారో అందరికీ తెలుసు. అయినవాళ్లకు అప్పనంగా…

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో.. వారానికోసారి అధికారులందరినీ పిలిచి మీటింగులు పెట్టడం తప్ప.. వారి పని వారిని సజావుగా చేసుకోనివ్వకుండా వెంటపడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ఎంత డ్రామా సృష్టించారో అందరికీ తెలుసు. అయినవాళ్లకు అప్పనంగా దోచిపెట్టడానికి పోలవరం ప్రాజెక్టును కోట్లు కుమ్మరించే ఒక ఏటీఎం మిషన్ లాగా చంద్రబాబు నాయుడు వాడుకున్నారని ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. 

ఆయన స్వయంగా భుజానికెత్తుకుని సమర్ధించిన కాంట్రాక్టర్లు పనులు సరిగా చేయడం లేదని అధికారులు సమావేశాల్లో నివేదిస్తే… సదరు అధికారులపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన చరిత్ర, కాంట్రాక్టర్లకు కొమ్ము కాసిన చరిత్ర చంద్రబాబు ఖాతాలో పుష్కలంగా ఉంది. ఐదేళ్లపాటు ఎడతెగకుండా చేసిన దోపిడీ, చేసిన పాపం వలన ఈనాడు పోలవరం ప్రాజెక్టు దుస్థితిలో కునారిల్లుతోంది.

అడ్డగోలుగా దోచుకోమంటూ తన జాగీరు లాగా పోలవరాన్ని ఏ కాంట్రాక్టర్లకు అయితే చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చేశారో, వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పక్కకు తప్పించారు. పూర్తి పారదర్శకంగా ఉండేలాగా ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గేలాగా.. దోపిడీకి అడ్డుకట్టవేసే లాగా.. రివర్స్ టెండరింగును ఆయన తెరమీదకి తీసుకువచ్చారు. మెగా సంస్థ పోలవరం నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకుంది. అప్పటినుంచి వారు పనులు సాగిస్తూ ఉన్నారు.

తాజాగా అసెంబ్లీలో మంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘పోలవరం జాతీయం జరగడానికి ఇవాళ్టి దుస్థితిలో ఉండడానికి కారణం పాత ప్రభుత్వమే’ అని ఈ స్పష్టంగా ప్రకటించారు. అప్పటి నిర్మాణంలో జరిగిన అవకతవకల కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ మాట అనగానే ఈనాడుకు రోషం, కోపం వచ్చినట్లుగా కనిపిస్తోంది. 

ఎందుకంటే తెలుగుదేశం హయాంలో మలిదశలో పోలవరం కాంట్రాక్ట్ నిర్మాణం బాధ్యతలు రామోజీరావు కుటుంబంతో వియ్యమందిన నవయుగ సంస్థ చేపట్టింది. తొలుత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కోసం చంద్రబాబు ఎంత అడ్డగోలుగా వ్యవహరించినా నిర్మాణం వాళ్లకు చేతకాక చేతులెత్తేశారు. ఆ తరువాత పోలవరాన్ని రామోజీ కుటుంబ వియ్యంకుడి చేతిలో పెట్టారు. సజావుగా పనులు చేయడం వారి వల్ల కూడా కాలేదు.

అందుకే పోలవరం పరిస్థితి పాత ప్రభుత్వం వైఫల్యం అని జగన్ నిందించగానే రామోజీరావుకు కోపం వచ్చినట్లుగా ఉంది. పాత ప్రభుత్వం వైఫల్యం అంటే అది తమ కుటుంబంతో వియ్యమందిన నవయుగ వారి వైఫల్యం కిందికి వస్తుందని ఆయన ఉడికిపోయినట్టుగా కనిపిస్తోంది. వైఫల్యం మొత్తం జగన్ ప్రభుత్వానిది మాత్రమే అని సుదీర్ఘమైన కథనాలను వండి వార్చి తమ పత్రిక నిండా పరచిపెట్టారు. 

అయినా ఏ ప్రభుత్వం హయాంలో ఎంత పని జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో గుర్తించలేని స్థితిలో ప్రజలు ఎప్పటికీ ఉండరు. మీడియా చేతిలో ఉన్నది కదా అని అడ్డగోలుగా సాగించే ప్రచారాలు ఒక దశ వరకు మాత్రమే రక్షణ ఇస్తాయి. తరువాత ఎవరైనా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.