ఒకప్పుడు తిరుపతి ల్యాండ్‌మార్క్ ద్వారకాహోటల్. 1988లో ఆంధ్రజ్యోతి సబ్ ఎడిటర్ గా చేరినపుడు ఆఫీసులో అడిగిన ప్రశ్న “ద్వారకా బిర్యానీ తిన్నావా” అని. అంత బావుంటుందా అని అడిగితే సూపర్ అన్నారు. ఎంత అంటే 18 రూపాయలు. 3 రూపాయలకి ప్లేట్ భోజనం పెట్టే కాలంలో 18 అంటే చాలా ఎక్కువ. ట్రెయినీగా నా జీతం 800.
ఒక రోజు ధైర్యం చేసి వెళ్లాను. బయటి నుంచి పెద్ద Look ఉండదు. కానీ, లోపల చాలా రష్. సీట్ కోసం Wait చేసాను. చికెన్ బిర్యానీ నిజంగానే అద్భుతం. మామూలు మీల్స్ 13 రూపాయలు. తరువాత అది కూడా తిన్నా. సాంబార్, రసం, పెరుగు సూపర్. కొన్నేళ్లు ద్వారక, లైఫ్ లో భాగమైంది. ప్రత్యేకమైన అకేషన్ ఉన్నా, మిత్రులు తిరుపతికి వచ్చినా వెళ్లడం తప్పనిసరి.
కొన్ని దశాబ్దాలు తిరుపతిలో నెంబర్ వన్ నాన్‌వెజ్ రెస్టారెంట్. పోటీగా కొన్ని పదుల హోటళ్లు వచ్చాయి. ద్వారకాలోని వెయిటర్లని, వంట మాస్టర్లని లక్షల రూపాయల ఆశ చూపి మరీ తీసుకెళ్లారు. ఎవరూ సక్సెస్ కాలేదు. ద్వారకా బిజినెస్ తగ్గలేదు. దీనికి కారణం యజమాని జయరాం చౌదరి. ఆయన కౌంటర్లో వుండేవాడు కాదు. కిచెన్ లోనే ఉండేవాడు. వంట మాస్టర్ ఏ కారణంతో అలిగినా, ఇంటికెళ్లి బుజ్జగించి తెచ్చుకునేవాడు.
మొదట తిన్నప్పుడు 18 రూపాయలు అయితే ఆఖరుసారి బిర్యానీ తినింది 250 రూపాయలకి. ఆశ్చర్యం ఏమంటే రోజుకి లక్షల రూపాయల వ్యాపారం జరిగినా చిన్న బిల్డింగ్‌లోనే నడిచింది తప్ప Expansionకి పోలేదు. 40 ఏళ్లు ఒక హోటల్ రుచి పోకుండా ఉండడం విశేషమే. అయితే వారసత్వాన్ని కాపాడుకోవడం కష్టం. తండ్రికి ఉన్నంత Fire, కసి పిల్లలకు ఉండదు. వాళ్లకి కష్టాలు తెలియవు, డబ్బులో పెరుగుతారు కాబట్టి. మనుషులకి జీవితం, మరణం ఉన్నట్టే కట్టడాలకి కూడా వుంటుంది. ఉజ్జ్వల దశ, క్షీణ దశ కూడా ఉంటాయి.
ద్వారకా లేకపోవచ్చు. తిరుపతి వాసులకి అది ఎప్పుడూ వుంటుంది, జ్ఞాపకాల్లో!
జీఆర్ మహర్షి